కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన అమెరికా

Update: 2020-04-12 06:10 GMT
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఆదేశాన్ని పెద్దగా ప్రభావితం చేయకున్నా.. అమెరికాను మాత్రం శవాల దిబ్బగా మార్చేసింది. తాజాగా ఆదివారం నాటికి ప్రపంచంలోనే అత్యధిక మరణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవడం తీవ్ర విషాదం నింపింది. నాలుగు రోజులుగా అమెరికాలో రోజుకు 2వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లోనే మరో 2108మంది చనిపోయారు. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 1920మంది ప్రాణాలు కోల్పోయారు.
 
దీంతో అమెరికాలో మొత్తం కరోనా మరణాలు 20వేలు దాటాయి. ప్రపంచంలో అత్యధికంగా ఇప్పటివరకు ఇటలీలో 19468 కరోనా మరణాలు ఉండగా.. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ఆ సంఖ్యను దాటేసింది. అమెరికాలో మొత్తం మరణాలు ఆదివారం నాటికి 20506కు చేరుకున్నాయి. బాధితుల సంఖ్య ఏకంగా 532300కు చేరింది.

ఆదివారంతో ప్రపంచంలోనే కరోనాతో అత్యధిక మరణాలు సంభవించిన అమెరికా అవతరించింది. ఇటలీని దాటేసి అగ్రస్థానంలోకి చేరింది.  
 
న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. న్యూయార్క్ ఆస్పత్రుల్లో 2వేల మంది వృద్ధులు, రోగులు కరోనాతో చనిపోయారు.ఈ మృతదేహాలను కూడా భద్రపరచడానికి స్థలం, మార్చురీలు లేకపోవడంతో ఓ గదిని కేటాయించారు.

ఇక గడిచిన 24 గంటల్లో అమెరికాలో మొత్తం 25వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. భారత సంతతికి చెందిన 40 మంది కరోనాతో మృతిచెందారు. ఇక భారత్ పంపిన 9 టన్నుల హైడ్రాక్సీ క్లోర్లోక్విన్ ఔషధాలు శనివారం ఉదయం అమెరికాకు ప్రత్యేక విమానంలో చేరుకున్నాయి.
Tags:    

Similar News