భార‌తీయుల‌కు మ‌రో షాక్‌: ‌కొన్నాళ్లు వీసాల నిలిపివేత‌

Update: 2020-06-12 17:10 GMT
మహమ్మారి వైర‌స్ ప్రపంచంలో క‌న్నా అధికంగా అమెరికాలో తీవ్రంగా ఉంది. ప్ర‌పంచంలోనే కేసులు, మృతుల్లో టాప్ వ‌న్‌లో ఈ దేశం నిలుస్తోంది. దీంతో ఆ దేశంలో ప‌రిస్థితి చేయి దాటింది. ఇప్పటికే ఈ అగ్రరాజ్యంలో లక్ష మందికి పైగా వైర‌స్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్ప‌కూలిపోయింది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా మారింది. ఈ స‌మ‌యంలో నివార‌ణ చ‌ర్య‌లు అమెరికా ప్ర‌భుత్వం చేపట్టింది. అందులో భాగంగా విదేశీయుల‌ను అనుమ‌తించ‌వ‌ద్ద‌ని అధ్య‌క్ష‌డు డొన‌ల్డ్ ట్రంప్ నిర్ణ‌యించాడు. మొద‌టి నుంచి ట్రంప్ స్థానిక (లోక‌ల్‌) నినాదం పాటిస్తున్నాడు. అదే అత‌డి గెలుపున‌కు కార‌ణ‌మైంది.

ప్ర‌స్తుత విప‌త్క‌ర స‌మ‌యంలో త‌మ దేశానికి చెందిన ప్ర‌జ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని, వారికి ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు ట్రంప్ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే విదేశాల నుంచి వ‌చ్చేవారిని అనుమ‌తించ‌వ‌ద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అమెరికా వీసాల‌న్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అమెరికాలో నిరుద్యోగం రికార్డుస్థాయిలో పెరిగిపోయింది. ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పలు రకాల ఉద్యోగ, ఉపాధి వీసాలను కొంతకాలంపాటు నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ దేశంలో చ‌ర్చ సాగుతోంది. ఈ నిర్ణ‌యంతో భారతీయులకు భారీ దెబ్బ త‌గ‌ల‌నుంది. హెచ్1 బీతోపాటు హెచ్2 బీ, జే 1, ఎల్ 1 వీసాలు కూడా నిలిపివేయాలనుకుంటున్న జాబితాలో ఉన్నట్లు తెలిసింది. దీంతో అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయులపైనే తీవ్రంగా ప్ర‌భావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. చాలామంది వీసా హెచ్1 బీ పైనే ఉంటున్నారు. అయితే, ట్రంప్ నిలిపివేయాలనుకుంటున్న ఉద్యోగ వీసాల్లో ఇది కూడా ఉన్నట్లు ఆ దేశానికి చెందిన మీడియా సంస్థ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్‌ తెలిపింది. ఈ నిర్ణ‌యంతో ఇప్ప‌టికే ఉన్న‌వారు ఉండ‌వ‌చ్చు. కానీ కొత్త‌వారికి ప్ర‌వేశం లేదు. ఈ నిర్ణయం అమ‌ల్లోకి వ‌స్తే కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌వ‌చ్చు. అయితే ఈ నిర్ణయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అమెరికా పౌరుల ఉపాధిని రక్షించేందుకు నిపుణులు అనేక మార్గాలు సూచించారని, వాటన్నింటినీ పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి హోగలన్ గిడ్లే తెలిపారు. ఈ నిర్ణ‌యాన్ని అమెరికావాసులు ఆహ్వానిస్తుండ‌గా మిగ‌తా దేశాల వారు వ్య‌తిరేకిస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని పేర్కొంటున్నారు. ఏది ఏమున్న ట్రంప్ అన్నంత ప‌ని చేసేలా ఉన్నారు. దీంతో కొన్నాళ్ల పాటు భార‌తీయులు అమెరికాయానంపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే‌.
Tags:    

Similar News