ఏపీకి పాకిన 'హిజాబ్ ' సెగ.. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2022-02-22 09:38 GMT
దాదాపు నెలరోజుల నుంచి కర్ణాటకను షేక్ చేస్తున్న హిజాబ్ వివాదం ఇప్పుడు ఏపీకి కూడా పాకింది. పక్కరాష్ట్రాలను షేక్ చేస్తోంది. రాజకీయ రగడగా మారింది. దీనిపై ఒక్కో నేత ఒక్కో రకంగా స్పందిస్తుండడంతో వివాదం పెద్దదవుతోంది. తాజాగా హిజాబ్ సెగ ప్రకాశం జిల్లాకు కూడా పాకింది.  వికాశ్, చైతన్యస్కూళ్లలో హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను స్కూల్ యాజమాన్యం అడ్డుకోవడం వివాదానికి కారణమైంది.

ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలోని ప్రైవేట్ స్కూల్స్ అయిన వికాష్, చైతన్యస్కూల్ లో హిజాబ్ వేసుకున్న ముస్లిం విద్యార్థినులను లోపలికి రావడానికి అనుమతించలేదు. వారిని యాజమాన్యం గేటు బయటే నిలబెట్టింది. హిజాబ్ ధరించి వస్తే లోపలికి రానిచ్చేది లేదని యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. ముస్లిం సామాజికవర్గానికి చెందిన పెద్దలు స్కూల్ వద్దకు చేరుకున్నారు. పేరెంట్స్ ఎంత చెప్పినా విద్యార్థినులకు లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇప్పటికే ఐదు రోజుల క్రితం విజయవాడలోని లయోలా కాలేజీలో కూడా ఇద్దరు విద్యార్థినులు హిజాబ్ ధరించినందుకు గాను క్లాసులోకి అనుమతించలేదు. ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు. కాలేజీకి యూనిఫామ్ లోనే రావాలని విద్యార్థినులకు సూచించినట్టుగా చెప్పారు.

బీజేపీ పాలిత కర్ణాటకలో చెలరేగిన ఈ వివాదంపై ఇప్పటివరకూ బీజేపీ అగ్రనేతలు నోరు విప్పలేదు. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎట్టకేలకు స్పందించారు. ఇన్నాళ్లికి నోరు విప్పారు. ‘విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే యూనిఫాం ధరించి కాలేజీలకు వెళితే మంచిది’ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అన్ని మతాల వారు స్కూల్ డ్రెస్ కోడ్ ను అంగీకరించాలని నా వ్యక్తిగత నమ్మకం. ఈ సమస్య ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టు అంశంపై విచారణను నిర్వహించాల్సి ఉంటుంది. ధర్మాసనం హిజాబ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అనుసరించాలి’ అని అమిత్ షా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

న్యాయస్తఆనం తీర్పులు వెలువరించాక మన నిర్ణయాలు మారచ్చు. కోర్టు తీర్పులను ఎవరైనా గౌరవించాల్సిందే. దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా? లేదంటే ఇష్టానుసారం నడుస్తుందా? అనేది మనమే నిర్ణయించుకోవాలిఅని అమిత్ షా అన్నారు.

-హిజాబ్ అంటే ఏమిటీ?

హిజాబ్ అంటే తెర.. మహిళలు జట్టును, మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని ‘హిజాబ్ ’ అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై  ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రమే కనిపిస్తాయి.

1983  కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.

గత నెలరోజులుగా కర్టాటక రాష్ట్రంలోని ఉడుపి, చిక్కమగళూరుల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్స్ ధరిస్తూ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హిజాబ్స్ ధరించిన విద్యార్థులు ఆ డ్రెస్ ధరించడం మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ప్రతిగా హిందూ మతానికి చెందిన విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు.
Tags:    

Similar News