నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్: నారా లోకేష్ తో ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ

Update: 2022-05-28 10:01 GMT
నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా పట్టు ఉన్న కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

గతంలో అంటే 1985లో ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా రాపూరు అసెంబ్లీ నుంచి గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి రాపూరు నుంచే 1999, 2004ల్లో రెండుసార్లు అసెంబ్లీకి ఎంపికయ్యారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక ఆయన తెలుగుదేశంలో చేరారు. మళ్లీ 2018లో వైఎస్సార్సీపీలో చేరి వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో రాపూరు నియోజకవర్గం పునర్విభజనలో రద్దు కావడంతో ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇప్పుడు తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి నారా లోకేష్ తో భేటీ కావడంతో ఆమె టీడీపీలో చేరతారని తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వచ్చే నెలల జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఒకవేళ టీడీపీ ఉప ఎన్నికలో పోటీ చేయకుంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అందులోనూ గతంలో అంటే 2009లో కైవల్యా రెడ్డి తండ్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దీంతో ఆత్మకూరులో కూడా ఆనం కుటుంబానికి పట్టు ఉంది. పెద్ద ఎత్తున అనుచరులు, బలగం ఉంది. దీంతో కైవల్యా రెడ్డి ఆత్మకూరు సీటుపై కన్నేశారని సమాచారం. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో ఏదో ఉన్నానంటే ఉన్నా అన్నట్టు ఉన్నారు. ఆ పార్టీలో పెద్దగా ఆయన మాటకు విలువ లేదనే బాధలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెను ఆనం రామనారాయణరెడ్డే టీడీపీలో చేర్చుతున్నారని సమాచారం.
Tags:    

Similar News