భారత వికాస సమితి.. కేసీఆర్ కొత్త కలకు ఈ పేరే ఫైనల్ అట!

Update: 2022-10-02 03:40 GMT
తాను టార్గెట్ చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే కాదు.. ఆ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన తాను.. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలని.. కేంద్రంలో చక్రం తిప్పాలని.. తాను మరింత పవర్ ఫుల్ కావాలని తపిస్తున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే భారీ ఎత్తున కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ పేరుపై ఇప్పటికే బోలెడంత చర్చ నడుస్తోంది.

కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ పేరును.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సూపర్ సక్సెస్ అయిన టీఆర్ఎస్ లోని ''టీ''ను తీసేసి.. దానికి 'బి' తగిలించినట్లుగా ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితిగా మారిస్తే.. సరిగ్గా సూట్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. హిందీలో 'రాష్ట్ర' అనే పదానికి దేశం అన్న విస్త్రతార్థం ఉన్న వేళ.. బీఆర్ఎస్ పేరు సరిగ్గా సూట్ అవుతుందన్న చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకుపెద్ద ఎత్తున వినిపించిన భారత రాష్ట్ర సమితికి బదులుగా మరో పేరు తెర మీదకు వచ్చింది. భారత రాష్ట్ర సమితి పేరు ఆసక్తికరంగా లేదన్న వాదనల నేపథ్యంలో దానికి బదులుగా 'భారత వికాస సమితి' పేరును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన రాకున్నా.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ పేరునే ఫైనల్ చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.

భారత రాష్ట్ర సమితి పేరులో ప్రాంతీయ పార్టీ అన్నట్లుగా ఉందని.. అందుకుభిన్నంగా యావత్ దేశాన్ని రిప్రజెంట్ చేసేలా పేరు ఉండాలన్న కేసీఆర్ సూచన నేపథ్యంలో.. తర్జనభర్జనల అనంతరం.. భారత వికాస సమితి పేరును ఫైనల్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ ప్రచారంలో నిజం ఎంతన్న విషయం మరో మూడు రోజులు ఆగితే తెలిపోతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News