అంబానీ కేసులో మరో ట్విస్ట్..హిరేన్ మృతదేహం లభ్యమైన స్పాట్ లోనే మరో శవం!

Update: 2021-03-20 13:40 GMT
భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంటి దగ్గర్లో పేలుడు పదార్థాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. మన్సూఖ్ హిరేన్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో తాజాగా మరో వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడిని షేక్ సలీమ్ అబ్దుల్ గా గుర్తించారు. రేతీ బందర్ ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల సలీమ్, స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. షేక్ సలీమ్ అబ్దుల్ ప్రమాదవశాత్తూ మరణించాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. శనివారం ఉదయం 11.10 గంటల సమయంలో అతడు ఆ ఏరు   వద్దకు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. ప్రమాదవశాత్తూ అతడు కాలు జారి నీటిలో పడిపోయాడని తెలిపారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బురద నీటిలో కూరుకుపోయిన సలీమ్‌ ను బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. సలీమ్ ప్రమాదవశాత్తూ మరణించినట్లు ముంబ్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల ఘటనతో అతడికి ఎలాంటి సంబంధం లేదని పరోక్షంగా పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు, మన్సూఖ్ హిరేన్ మృతి కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ ఐఏ కు అప్పగించింది.
Tags:    

Similar News