కేసీఆర్ పై కస్సుమంటూ వార్నింగ్ ఇచ్చేసిన ఏపీ మంత్రి

Update: 2022-02-05 05:30 GMT
రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉంటున్నాయన్న విషయం తెలిసిందే. మొదటి టర్మ్ తో పోలిస్తే.. కేసీఆర్ రెండో టర్మ్ వేళలో ఏపీలో ఆయన కోరుకున్నట్లుగా జగన్ ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. అప్పటి నుంచి రెండు ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉండటం తెలిసిందే. కొన్ని అంశాలకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య దూరం పెరిగినా.. ఆ అంశాల జోలికి ఏపీ మంత్రులు దూకుడుగా వ్యవహరించింది లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేసినా.. మంత్రులు తమకు సంబంధం లేదన్నట్లుగానే ఊరుకున్నారు తప్పించి.. అంతేలా రియాక్టు అయ్యింది లేదు.

అలాంటిది తాజాగా ఏపీ మంత్రి స్సందించిన తీరు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొనటం తెలిసిందే. దీనిపై తెలంగాణలోని విపక్షాలు మండిపడ్డాయి. తాజాగా ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కొంతమంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్లను అంతలా కలిచివేసేలా చేస్తుందో? అంటూ ప్రశ్నించారు.

దళితుల ఆత్మగౌరవాన్ని ఇలాంటి వ్యాఖ్యలు దెబ్బ తీస్తాయన్న ఆయన.. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారన్నారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కుహనా మేధావిగా అభివర్ణించటం.. ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే.. చూస్తూ ఊరుకోమన్న ఆయన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే..సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడిన సమావేశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు కమ్ అన్ని అంశాలకు స్పందించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి హాజరైనా.. ఆయన మాత్రం ఆ అంశాల జోలికి వెళ్లకపోవటం గమనార్హం. మరి.. ఏపీ మంత్రి మండిపాటుపై తెలంగాణ మంత్రులు స్పందిస్తారా? కామ్ గా ఉంటారా? అన్నది చూడాలి.
Tags:    

Similar News