నిన్న వైసీపీ.. నేడు టీడీపీ.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో నేత‌ల క‌ప్ప‌గంతులు!

Update: 2022-09-19 08:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు సాధించాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దిశ‌గా ఇప్ప‌టికే పార్టీ ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు, ఎమ్మెల్సీల‌కు, నేత‌ల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశారు. అలాగే తాము మొద‌ట గెలుచుకునే నియోజ‌క‌వ‌ర్గం కూడా కుప్పమేన‌ని వైఎస్సార్సీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 50 కార్య‌క‌ర్త‌ల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ కూడా అయ్యారు.

మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలోనే ఆయ‌న‌ను ఓడించి షాకివ్వాల‌నే యోచ‌న‌తో ఉన్న జ‌గ‌న్ అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిపోయిన భ‌ర‌త్‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అంతేకాకుండా ఆయ‌న‌ను చిత్తూరు వైఎస్సార్సీపీ జిల్లా అధ్య‌క్షుడిగా కూడా చేశారు. అంతేకాకుండా కుప్పంలో చంద్ర‌బాబును ఓడించే బాధ్య‌త‌ను పుంగ‌నూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌గించారు. పెద్దిరెడ్డి వ్యూహాలు ఫలించి పంచాయ‌తీ, మండ‌ల‌ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది.

ఇంకోవైపు సెప్టెంబ‌ర్ 22న సీఎం వైఎస్ జ‌గ‌న్ కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు. రూ.66 కోట్ల‌తో వివిధ అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు హడావుడి చేస్తున్నారు. గోడ‌ల‌పై కుప్పం మ‌న‌దేన‌ని.. 175కి 175 టార్గెట్ అని నినాదాలు రాశారు. ఇంకోవైపు జ‌గ‌న్ రాక‌ను పుర‌స్క‌రించుకుని టీడీపీ నేత‌ల‌ను పెద్ద ఎత్తున వైసీపీలోకి చేర్చుకుంటున్నారు.

అయితే ఇవ్వాళ ఒక పార్టీలో ఉన్న నేత మ‌రో పార్టీలోకి జంప్ అవుతుండ‌టం విశేషం. వివిధ ప‌నుల మీద అధికారుల‌ను, వైసీపీ నేత‌ల‌ను టీడీపీకి చెందిన‌వారు ఎవ‌రైనా క‌ల‌స్తే వారి మెడ‌లో వైఎస్సార్సీపీ కండువాలు క‌ప్పేస్తున్నార‌నే విమ‌ర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ క్ర‌మంలో శనివారం సెప్టెంబ‌ర్ 17న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మల్లానూరు గ్రామ పంచాయతీకి చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషాశ్రీ చరణ్‌, ఎంపీ రెడ్డ‌ప్ప‌, ఎమ్మెల్సీ భ‌ర‌త్‌ వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పారు.

అయితే ఇంతలోనే ఓ టీడీపీ నేత మాత్రం వైఎస్సార్సీపీకి షాక్ ఇచ్చారు. కుప్పం మండ‌లం చెక్కునత్తం గ్రామానికి చెందిన తెలుగు యువత అధ్యక్షుడు రామప్ప మ‌ళ్లీ తిరిగి ఆదివారం సెప్టెంబ‌ర్ 18న‌ టీడీపీలో చేర‌డం విశేషం. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే రామ‌ప్ప టీడీపీలోకి దూకేశాడు.

అయితే తాను వైఎస్సార్సీపీలో చేర‌లేద‌ని రామ‌ప్ప చెబుతున్నారు. తాను నిర్మించుకున్న ఇంటికి సంబంధించి బిల్లులు చెల్లిస్తామ‌ని చెబితే తాను వైఎస్సార్సీపీ నేత‌ల వ‌ద్ద‌కు వెళ్లాన‌ని అంటున్నాడు. అక్క‌డ వారు త‌న‌కు బ‌ల‌వంతంగా వైసీపీ కండువా క‌ప్పార‌ని ఆరోపిస్తున్నాడు.
ప్రాణం ఉన్నంత వరకు టీడీపీని వీడను అని రామ‌ప్ప చెబుతున్నాడు. వైసీపీలో చేర‌డానికి తిర‌స్క‌రించినందుకు ఇటీవల త‌మ‌ గ్రామంలో పలువురి పింఛన్లను వైసీపీ నేత‌లు తొలగించినట్లు రామ‌ప్ప ఆరోపిస్తున్నాడు.

త‌న గ్రామంలో ఇళ్లు నిర్మించుకున్న‌వారికి బిల్లులు రావ‌డం లేద‌ని త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. దీంతో టీడీపీ యువ‌త అధ్యక్షుడి హోదాలో తాను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని క‌ల‌సి స‌మ‌స్య‌లు వివ‌రిద్దామ‌ని.. ప్ర‌జ‌లకు మేలు చేయాల‌ని కోరడానికి ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లాన‌ని తెలిపాడు. అయితే వెంట‌నే అక్క‌డ ఆయ‌న త‌న‌కు వైసీపీ కండువా క‌ప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తే వారించి వ‌చ్చేశాన‌ని వివ‌రించాడు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకే కండువాలు కప్పి టీడీపీ నుంచి పార్టీ మారుతున్నారని అధికార పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిప‌డ్డారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News