ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్తపై అరెస్టు వారెంట్

Update: 2022-04-06 05:10 GMT
ఫైర్ బ్రాండ్ కమ్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబానికి షాక్ తగిలిన పరిస్థితి. ఆమె భర్త ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్ జారీ చేస్తూ చెన్నై జార్జిటౌన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సెల్వమణి దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంగాల సమ్మేళనం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అసలీ వివాదం ఎప్పుడు.. ఎలా మొదలైందన్న విషయానికి వెళితే.. సెల్వమణి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తాజా పరిస్థితికి కారణంగా చెబుతారు.

2016లో సెల్వమణి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అనర్బరుసు ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రా గురించి పలు అభిప్రాయాల్ని వెల్లడించారు. దీంతో.. సెల్వమణిపైనా.. అరుళ్ అనర్బరసు మీదా పరువు నష్టం కేసు వేశారు.

అయితే.. ఈ కేసు విచారణ వేళలోనే ముకుంద్ చంద్ బోద్రా మరణించారు. అయినప్పటికీ ఆయన కుమారుడు ఈ కేసును కంటిన్యూ చేస్తున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి వాయిదా మంగళవారం ఉండగా.. కోర్టుకు హాజరు కావాల్సిన సెల్వమణి హాజరు కాలేదు.

అంతేకాదు.. ఈ కేసు వాయిదాకు సెల్వమణి తరఫు న్యాయవాదులు సైతం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు వీరిద్దరిపై బెయిలబుల్ అరెస్టు వారెంట్ ఇష్యూ చేస్తూ విచారణను 23కు వాయిదా వేశారు.

పలువురు ప్రముఖులు కోర్టు వాయిదాకు హాజరు కాకుండా లేని తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. తాజా ఉదంతంలోనే సెల్వమణి ఇలాంటి పనే చేశారని చెప్పాలి.
Tags:    

Similar News