భారీ మ‌హిళ‌కు డేంజ‌ర్ చెప్పేసిన డాక్ట‌ర్లు

Update: 2017-04-30 09:56 GMT
500 కేజీల మ‌హాకాయం. న‌డ‌వ‌టం సంగ‌తి త‌ర్వాత‌. స‌రిగ్గా.. క‌ద‌ల్లేని ప‌రిస్థితి. అలాంటి వేళ‌లో.. ఆమె బ‌రువును ముంబ‌యి డాక్ట‌ర్లు త‌గ్గిస్తార‌న్న ఆశ‌తో కార్గో ఫ్లైట్ లో బెడ్ మీద తీసుకొచ్చిన వైనం తెలిసిందే. 500 కేజీల ఈజిఫ్టు మ‌హిళ ఎమాన్ అహ్మ‌ద్ బ‌రువును అతి కొద్ది కాలంలోనే స‌గానికి పైనే త‌గ్గించేసిన‌ప్ప‌టికీ.. ముంబ‌యి వైద్యులు మాత్రం వివాదాల్లో చిక్కుకున్నారు.

ప్ర‌స్తుతం ఎమాన్‌ కు అందిస్తున్న వైద్యాన్ని నిలిపివేసి.. ఆమెను తిరిగి ఈజిఫ్టుకు త‌ర‌లించాల‌న్న ఆలోచ‌న‌లో ఆమె కుటుంబ స‌భ్యులు ఉన్నారు. ఈ వ్య‌వ‌హారంపై వాదోప‌వాదాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌స్తుతం ముంబ‌యిలోని సైఫీ ఆసుప‌త్రికి చెందిన బేరియాట్రిక్ స‌ర్జ‌న్ ల‌క్డావాలా ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఎమాన్‌కు స‌రిగ్గా చికిత్స అందించ‌టం లేద‌ని.. బ‌రువు త‌గ్గిస్తున్న‌ట్లు అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని ఆరోపిస్తూ.. ఆమెను త‌మ దేశానికి తీసుకెళుతున్న‌ట్లుగా చెప్పారు.

ఇదిలా ఉంటే.. త‌మ‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై తాజాగా రియాక్ట్ అయ్యారు సైఫీ ఆసుప‌త్రి వైద్యులు. క్లిష్ట స‌మ‌యంలో ఎమాన్‌ను త‌ర‌లించాల‌న్న ఆలోచ‌న ఏ మాత్రం మంచిది కాద‌ని.. అది ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమెకు చికిత్స జ‌రుగుతోంద‌ని.. త‌మ ఆసుప‌త్రికి వ‌చ్చిన‌ప్పుడు ఆమె బ‌రువు 500 కేజీలు ఉంటే.. ఇప్పుడామె బ‌రువు 176 కేజీలు మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఎమాన్ బ‌రువు త‌గ్గిస్తామ‌ని మాత్ర‌మే తాము చెప్పామే త‌ప్పించి.. ఆమెను న‌డిచేలా చేస్తామ‌న్న మాట‌ను తాము ఎప్పుడూ చెప్ప‌లేదంటున్నారు.

ఆమె స‌గం బ‌రువు త‌గ్గింద‌ని.. ఆ విష‌యంలో ఎలాంటి సందేహం లేద‌ని.. ఆమెను కార్గో ఫ్లైట్లో బెడ్ మీద తీసుకొచ్చామ‌ని.. తిరిగి వెళ్లేట‌ప్పుడు ఛైర్‌లో తీసుకెళ‌తామ‌ని చెప్పామ‌ని.. తాము త‌మ హామీని నిల‌బెట్టుకున్నామ‌న్నారు. ఆమె స‌గానిక‌న్నా ఎక్కువ బ‌రువే త‌గ్గింద‌ని.. అందులో ఎలాంటి సందేహం లేద‌న్న వైద్యుడు ల‌క్డావాలా.. తాను ఇచ్చిన హామీకి త‌గ్గ‌ట్లే ప్రస్తుతం ఎమాన్‌.. బిజినెస్ క్లాస్‌లో వెళుతోంద‌న్నారు.

ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేయాల‌న్న సూచ‌న‌ను తాము చేయ‌లేద‌ని.. ఎమాన్ కుటుంబ స‌భ్యులు ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. దాంతో త‌మ‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆమెను ముంబ‌యి నుంచి యూఏఈకి తీసుకెళ్లాల‌న్న కుటుంబ స‌భ్యుల మాట‌కు స‌రేన‌ని చెప్పామే త‌ప్పించి.. ఆమెను డిశ్చార్జ్ చేయ‌టం లేద‌ని తెలిపారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆమెను తీసుకెళ్ల‌టం ఏ మాత్రం శ్రేయ‌స్క‌రం కాద‌న్న ముంబ‌యి వైద్యుల మాట‌ను ఎమాన్ కుటుంబ స‌భ్యులు ఏ మాత్రం విన‌క‌పోవ‌టంపై భిన్నాభిప్రాయామాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కార‌ణాలు ఏమైనా.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ముంబ‌యి వైద్యుల మాట‌ను ఎమాన్ కుటుంబ స‌భ్యులు విన‌టమే మంచిద‌న్న అభిప్రాయాన్ని నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News