అసెంబ్లీ సెష‌న్ : అసెంబ్లీ ప్రాంగ‌ణంలోనే పోలింగ్

Update: 2022-07-06 06:48 GMT
శాస‌న స‌భ వ‌ర్షాకాల స‌మావేశాలను నిర్వ‌హించేందుకు  రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మాయ‌త్తం అవుతోంది. ఈ నెల 19 నుంచిఈ స‌మావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఐదు రోజుల పాటు నిర్వ‌హించేందుకు సంబంధిత ఏర్పాట్లు చేస్తోంది.ఈ నెల‌18న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ ఇక్కడి అసెంబ్లీ ప్రాంగ‌ణంలోనే జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డే మ‌న ఎంపీలూ, ఎమ్మెల్యేలూ త‌మ  ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఆ త‌రువాత స‌భ‌కు సంబంధించిన ప్ర‌క్రియ మ‌రుస‌టి రోజు నుంచి ప్రారంభం కానుంది.

శాస‌న స‌భ‌, శాస‌న మండ‌ళ్ల వ్య‌వ‌హారాల స‌ల‌హా మండ‌ళ్ల భేటీ  ఈనెల 18న లేదా 19 న జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశాల్లో  ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చే విష‌యాల‌పైనే స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. ముఖ్యంగా ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా కు సంబంధించి ముఖ్య‌మంత్రి విన‌తి ప‌త్రం ఇచ్చారు. దీనిపై మ‌రోసారి తెలుగుదేశం పార్టీ లెవ‌నెత్తే అవ‌కాశం ఉంది.


అదేవిధంగా విశాఖ భూముల వ్య‌వ‌హారంపై మ‌రో ర‌చ్చ జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ రుషి కొండ చుట్టూ జ‌రుగుతున్న త‌వ్వ‌కాలు, ల్యాండ్ మాఫియాపై ఇప్ప‌టికే ప‌లు సార్లు టీడీపీ గగ్గోలు పెట్టింది. అదేవిధంగా రాష్ట్రంలో త‌మ‌పై జ‌రుగుతున్న అక్ర‌మ అరెస్టుల‌పై కూడా టీడీపీ మాట్లాడ‌నుంది. ముఖ్యంగా మ‌ద్యం కొనుగోళ్లు అమ్మ‌కాల‌పై ఇప్ప‌టికే ప‌లు మార్లు మాట్లాడిన టీడీపీ  స‌భ దృష్టికి కూడా తీసుకువెళ్లనుంది. ముఖ్యంగా ప‌న్నుల వ‌డ్డ‌న, జీఎస్టీ ప‌రిధి పెంపున‌కు రాష్ట్రం అంగీక‌రించిన విధానంపై కూడా వివాదం రేగే అవ‌కాశాలున్నాయి. ఏ విధంగా చూసుకున్నా శాస‌న స‌భ వాగ్వాదాల మ‌ధ్యే న‌డ‌వ‌నుంది.


ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎప్ప‌టి నుంచో లోక‌ల్ ఏరియా డెల‌ప్మెంట్ ఫండ్ అడుగుతున్నారు. ఆ నిధులు కాస్త ఇస్తే అభివృద్ధి ప‌నులు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. విప‌క్ష స‌భ్యులు కూడా ఇవే నిధుల కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. పంచాయ‌తీల్లో నిధుల‌ను ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చెప్పాపెట్ట‌కుండా వాడుకుంద‌ని ఆరోపిస్తూ ఇప్ప‌టికే టీడీపీ ర‌భస చేస్తోంది. అయితే  వీటిని తిరిగి చెల్లిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా కూడా ఇప్ప‌టిదాకా వాటి ఊసే లేదు. వానా కాలం రాక దృష్ట్యా ఇప్ప‌టిదాకా రోడ్ల మ‌ర‌మ్మ‌తులే పూర్తికాలేదు.


రెండు వేల కోట్ల రూపాయ‌ల‌తో రోడ్ల మ‌ర‌మ్మ‌తులు చేసి ఇస్తామ‌ని చెప్పినా ఎక్క‌డా ఆ ఊసే లేదు. మొన్న‌టికి మొన్న శ్రీ‌కాకుళంలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న రీత్యా రోడ్ల‌కు ప్యాచ్ వ‌ర్క్ లు మాత్ర‌మే చేశారు.  ఇంకా వ్య‌వ‌సాయ మీట‌ర్ల రగ‌డ ఉండ‌నే ఉంది.

ఇవికాకుండా దావోస్ మీటింగ్ పై , పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌పై, ఉద్యోగావ‌కాశాల‌పై కూడా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. వీటితో పాటు నూత‌న విద్యా విధానం పేరిట పాఠ‌శాల‌ల విలీనంపై కూడా చ‌ర్చ న‌డ‌వ‌నుంది. ఏ విధంగా చూసుకున్నా కీల‌క అంశాల చ‌ర్చ‌కు ఐదు రోజులు అయితే స‌రిపోదు. గ‌డువు పెంచ‌మ‌ని విప‌క్షం కోరినా కోర‌వ‌చ్చు.
Tags:    

Similar News