రెడ్ల సింహగర్జనలో అనూహ్యం.. మంత్రి మల్లారెడ్డిపై దాడి!

Update: 2022-05-30 05:30 GMT
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తెలంగాణలో చోటు చేసుకోని ఈ ఉదంతం తెలంగాణ అధికార పక్షానికి షాకింగ్ గా మారింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ వైనంపై విభ్రాంతి వ్యక్తమవుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాటలతో సభికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. ఆయనపై దాడికి దిగటం.. దీంతో తన ప్రసంగాన్నిమధ్యలో ఆపి ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. అయినప్పటికీ సభికులు ఆయన కాన్వాయ్ పై కుర్చీలు.. వాటర్ బాటిళ్లు విసిరుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపాలిటీలో ఆదివారం రెడ్ల సింహగర్జన జరిగింది. ఈ సభకు మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 2018 ఎన్నికల సమయంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తారని సభికులు భావించారు. దీనికి తోడు.. కార్యక్రమ నిర్వాహకులు సైతం ఇదే విషయాన్ని ముందుగా చెప్పటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి.

ఇలాంటి వేళ.. మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగంలో రెడ్డి కార్పొరేషన్ ఊసు ప్రస్తావించకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని పదే పదే ప్రస్తావించటం.. సీఎం కేసీఆర్ ను పెద్ద ఎత్తున పొగడటం షురూ చేశారు. తెలంగాణలో 75 ఏళ్లలో జరగని డెవలప్ మెంట్ గడిచిన ఏడున్నరేళ్లలో టీఆర్ఎస్ పాలనలో జరిగిందని పేర్కొన్నారు. దీంతో అగ్రహించిన కొందరు నేతలు.. సభకు హాజరైన వారు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుర్చీలు పైకెత్తి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

అయినప్పటికీ వారి నిరసనను పట్టించుకోని మల్లారెడ్డి తన మాటల తీరును మార్చుకోలేదు. ఇతర సంక్షేమ పథకాల్ని ప్రస్తావించటం.. టీఆర్ఎస్.. కేసీఆర్ లను పొగుడుతూ తన స్పీచ్ ను కొనసాగించారు. ఈ క్రమంలో దళిత బంధు.. ఇతర పథకాల్ని వివరిస్తూ.. రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్న వ్యాఖ్యపై సభికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై వేదికపై ఉన్న మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరివర్దన్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో సహా పలువురు మంత్రితో వాగ్వాదానికి దిగారు.అదే సమయంలో సభికులు మంత్రి మల్లారెడ్డి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. సభకు వచ్చిన వారు మంత్రి మల్లారెడ్డి మాటలకు నిరసన తెలుపుతూ.. కుర్చీలు.. చెప్పులు.. వాటర్ బాటిళ్లు.. రాళ్లను స్టేజ్ మీదకు ఒక్కసారిగా విసరటం మొదలు పెట్టారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు సభా వేదిక మీదకు వచ్చిన మంత్రికి రక్షణగా నిలిచారు. పరిస్థితి అదుపు తప్పుతుందన్న విషయాన్ని గుర్తించిన మంత్రిని అతి కష్టమ్మీదా స్టేజ్ మీద నుంచి కాన్వాయ్ వద్దకు తీసుకెళ్లి కారులో కూర్చెబెట్టారు. కాన్వాయ్ వెళుతున్న సమయంలో సభికులు రాళ్లు.. చెప్పులు.. నీళ్ల బాటిళ్లు విసరటంతో పరిస్థితి రసాభాసాగా మారింది. పరిస్థితిని అదుపు చేయటంలో పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. జరిగిన పరిణామాలపై రెడ్డి సింహ గర్జన నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిమల్లారెడ్డి నోటికి వచ్చినట్లుగా మాట్లాడి సభను విఫలం చేశారని మండిపడ్డారు.
Tags:    

Similar News