అయోధ్యలో అద్భుతం.. రెండు కళ్లు చాల్లేదు

Update: 2019-10-27 05:45 GMT
ప్రత్యక్ష దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో అద్భుతం జరిగింది. అయోధ్య గుండా ప్రవహించే సరయూ నదీ తీరంలో చోటుచేసుకున్న ఘటన గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.

అయోధ్య పక్కనే ప్రవహించే సరయూ నదీ తీరంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దీపావళి పండుగను పురస్కరించుకొని దీపోత్సవ్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. శనివారం రాత్రి చేపట్టిన ఈ దీపోత్సవ్ కార్యక్రమంలో ఏకంగా ఐదున్నర లక్షలకు పైగా దీపాలను ఒకే చోట లక్షలాది మంది భక్తులు వెలిగించి అద్భుతం ఆవిష్కరించారు. ఇలా దీపాలను ఇంత పెద్ద స్థాయిలో వెలిగించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అట..

దీపావళి పర్వదినం సందర్భంగా ఏకంగా 5,51,000 మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి కళ్లు మిరమిట్లు గొలిపే కాంతి వెలుగులను పంచారు. గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కడమే లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్ సర్కారు దీన్ని నిర్వహించింది. సాయంత్రం 7 గంటలకు సరయూ నదీ తీరంలో ఘాట్లలో ఈ దీపాలు కన్నుల పండువగా కనిపించాయి. సుమారు 3 గంటల పాటు ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. మరో లోకం కనిపించింది. ఈ దీపోత్సవ్ కోసం ఏకంగా యూపీ సర్కారు 133 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం విశేషం.

ఇక దీపావళి సందర్భంగా వేడుక ప్రాంగమంతా శ్రీరామచంద్రుడి కీర్తనలు, హనుమాన్ చాలీసా పఠనంతో సరయూ తీరం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Tags:    

Similar News