సీనియ‌ర్ త‌మ్ముళ్ల‌పై బాబు 'పొత్తు' ఆగ్ర‌హం!

Update: 2018-08-25 03:50 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రిస్థితి చాలా ఇబ్బందిక‌రంగా మారింది. ఓప‌క్క జ‌గ‌న్‌.. మ‌రోప‌క్క ప్ర‌జ‌ల్లో త‌న పాల‌న‌పై పెరుగుతున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న ఎన్నిక‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదోలా ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌కుంటే పార్టీ ప‌ని అయిపోవ‌ట‌మే కాదు.. తన కెరీర్ కూడా క్లోజ్ అయిన‌ట్లేన‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

హోదాతో పాటు.. మోడీ కార‌ణంగా బీజేపీకి విడాకులు ఇచ్చేసిన బాబుకు ప‌వ‌న్ ఒక త‌ల‌నొప్పిగా మారాడు. 2014లో త‌న‌కు సొంత బ‌లం లేకున్నా.. బీజేపీ.. ప‌వ‌న్ సాయం తోడైనా ఆప‌సోపాలు ప‌డి గెలిచిన బాబుకు..ఈసారి ఒంట‌రిగా బ‌రిలోకి దిగే ద‌మ్ము లేద‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈసారి ఎన్నిక‌ల్లో టీడీపీ తీవ్రంగా వ్య‌తిరేకించే కాంగ్రెస్ తో జ‌త క‌ట్టేందుకు బాబు ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని.. ఇందుకు సంబంధించిన కీల‌క భేటీలు పూర్తి అయినట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్య‌తిరేక‌త‌తో మొద‌లైంది. అలాంటి పార్టీతో పొత్తా? అంటూ పార్టీ సీనియ‌ర్ నేత‌లు సైతం విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌న‌సులో అనిపించింది క‌డుపులో దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడేయ‌టం పార్టీకి ఇబ్బందిక‌రంగా మారింది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఆలోచ‌న‌లు ఉంటే.. పార్టీ నేత‌లు మాత్రం త‌న ఆలోచ‌న‌ల్ని గుర్తించ‌కుండా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేయ‌టం ఆయ‌నకు మంట పుట్టిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ పొత్తుపై మంత్రులు అయ్య‌న్న‌పాత్రుడు.. కేఈలు స్పందించిన తీరుపై తీవ్ర ఆగ్ర‌హంతోబాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీలో చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే మీడియాతో మ‌న‌సులోని మాట‌ల్ని ఎలా చెబుతారంటూ వారికి  ప్ర‌త్యేక క్లాసులు పీకిన‌ట్లుగా చెబుతున్నారు.

కాంగ్రెస్ తో పార్టీ క‌లుస్తుంద‌ని తాను అనుకోన‌ని.. ఒక‌వేళ క‌లిస్తే అంత‌కంటే దుర్మార్గం ఉండ‌ద‌ని అయ్య‌న్న పాత్రుడు మీడియా వ‌ద్ద వ్యాఖ్యానించారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న దేశాన్ని.. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసి దోచుకుతిన్న కాంగ్రెస్ తో క‌ల‌వాల‌న్న నిర్ణ‌యం తీసుకుంటే మొద‌ట వ్య‌తిరేకించేది తానేన‌ని చెల‌రేగిపోయారు. ఒక‌వేళ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ తో జ‌త క‌ట్టే నిర్ణ‌య‌మే తీసుకుంటే తాను పార్టీలో ఉండ‌నంటూ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

అయ్య‌న్న పాత్రుడు మాట‌లు పార్టీలో సంచ‌ల‌నంగా మారాయి. మ‌రోవైపు క‌ర్నూలు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి సైతం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అసాధ్య‌మ‌న్న ఆయ‌న‌.. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ కాంగ్రెస్ ద‌రిద్రాన్ని పార్టీ అంటుక‌ట్టుకోమ‌ని వ్యాఖ్యానించారు. టీడీపీకి శ‌త్రువులు కాంగ్రెస్‌.. మోడీ.. జ‌గ‌న్ ల‌తో పాటు కొత్త‌గా ప‌వ‌న్ అంటూ పేర్కొన్నారు. పొత్తుల‌పై పార్టీ సీనియ‌ర్ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు బాబు సీరియ‌స్ అయ్యారు. పొత్తు విష‌యంపై పార్టీలో చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఇలా మీడియా ముందు మాట్లాడ‌టం ఏమిటి?  అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మంత్రులు తాము చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరిన‌ట్లుగా తెలుస్తోంది. పొత్తుల‌పై పోలిట్ బ్యూరో నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న విష‌యం తెలీదా?  పొత్తు కుదిరినట్లు కొంద‌రు.. పొత్తును వ్య‌తిరేకిస్తున్న‌ట్లు మ‌రికొంద‌రు ఎలా మాట్లాడ‌తారంటూ బాబు నిల‌దీసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News