ఆఫర్ ప్రకటించి అడ్డంగా బుక్ అయిన కేఎఫ్ సీ.. చైనాలో ఆగ్రహం

Update: 2022-01-18 04:14 GMT
ప్రపంచంలో ఎక్కడైనా సరే.. ఏదైనా వస్తువు మీద ఆఫర్ ప్రకటిస్తే.. వెనుకా ముందు చూసుకోకుండా కొనేసేందుకు ఆసక్తిని చూపిస్తాం. ఇక.. ప్రముఖ బ్రాండ్ కు అదిరే ఆఫర్ ను ప్రకటిస్తే.. ఎంతలా ఎగబడతామన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటి పనే చేసి.. అడ్డంగా బుక్ అయ్యింది ప్రఖ్యాత ఫుడ్ కంపెనీ కేఎఫ్ సీ. ప్రపంచ వ్యాప్తంగా నాన్ వెజ్ ప్రియులకు సుపరిచితమైన కేఎఫ్ సీ ఇప్పుడు చైనాలో తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది.

 ఆ సంస్థ సప్లై చేసే ఫుడ్ లో ఏదైనా అనారోగ్యకరమైన అంశాలు బయటకు వచ్చాయా? అంటే.. అదేమీ లేదని చెప్పాలి.

మరి.. కోపం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం లభిస్తే.. ఆశ్చర్యంతో అవాక్కు కావటమే కాదు.. చైనాలో ఇలా కూడా ఉంటుందా? అనుకోకుండా ఉండలేం. ఇంతకీ జరిగిందేమంటే.. చైనాలో కేఎఫ సీకి పెద్ద ఎత్తున స్టోర్లు ఉన్నాయి. డ్రాగన్ దేశంలోకి కేఎఫ్ సీ ఎంట్రీ ఇచ్చి 35 ఏళ్లనువిజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో.. సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది.
‘‘పాప్ మార్గ్’’ అనే బొమ్మల తయారీ సంస్థతో కలిసి కేఎఫ్ సీ ఒక ఆఫర్ ప్రకటించింది.

 కేఎఫ్ సీ మీల్ ను ఆర్డర్ చేస్తే.. దాంతో పాటు చూడచక్కని మిస్టరీ బాక్స్ ఇవ్వటం.. అందులో కొన్ని బొమ్మలు ఉంటాయి. వీటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఆఫర్ కు కేఎఫ్ సీ ఆశించింది వేరు.కానీ.. జరిగింది వేరు. ఈ ఆఫర్ కు చైనా వినియోగదారుల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

ఆ ఆఫర్ కారణంగా.. ఫుడ్ వేస్టేజీని ప్రోత్సహిస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇదంతా ఎందుకంటే.. 2020లో చైనా దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్.. క్లీన్ ప్లేట్ ఉద్యమాన్ని షురూ చేశారు.

ఇందులో దేశ ప్రజలంతా మితంగా.. అనవసరంగా తినకూడదని సూచన చేశారు. అయితే.. కేఎఫ్ సీ వారు ఇచ్చిన ఆఫర్ తో.. ప్రజలంతా ఫుడ్ ను విపరీతంగా వేస్ట్ చేస్తున్నట్లుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకుఒక ఉదాహరణ కూడా వారు చెబుతున్నారు.

ఒక వ్యక్తి కేఎఫ్ సీ ఇచ్చే బొమ్మల్ని సేకరించటం కోసమే వంద సార్లు కేఎఫ్ సీ మీల్ ను ఆర్డర్ చేసినట్లుగా చెప్పుకోవటం విశేషం. ఇలాంటి వారి కారణంగా.. ఫుడ్ వేస్ట్ అవుతుందన్న ఆగ్రహం కేఎఫ్ సీ మీదకు మళ్లింది.. అంతకంతకూ పెరుగుతన్న ఆగ్రహ జ్వాలల్ని కేఎఫ్ సీ ఎప్పటికి గుర్తిస్తుందో చూడాలి.
Tags:    

Similar News