కాస్కో అంటూ.. కేసీఆర్ తో ఢీకి బీజేపీ కొత్త సారథి రెడీ

Update: 2020-03-16 06:45 GMT
యువరక్తం, దూకుడుతునం కలగలిపి ఉన్న నాయకుడు.. కేసీఆర్ కు వెన్నంటే ఉండే కీలక నాయకుడిని చిత్తుగా ఓడించిన వ్యక్తి.. ఆర్ఎస్ఎస్ అండ దండలు పుష్కలంగా ఉన్న కార్యకర్తకు తాజాగా తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించారు. దీంతో కమల దళ అధిపతిగా క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్ నియమితులయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆదివారం తొలిసారిగా తెలంగాణ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్టీ కార్యక్రమం లో జరిగిన సభలో అధ్యక్షుడిగా తొలి ప్రసంగం చేశారు. తొలి ప్రసంగంలోనే తన టార్గెట్ టీఆర్ఎస్ అని, కేసీఆర్ తో తేల్చుకునేందుకు సిద్ధమని సవాల్ విసిరాడు. సవాళ్ల మీద సవాళ్ విసిరి టీఆర్ఎస్ పాలన, ఎంఐఎంపై దోస్తానాను తప్పుబట్టారు.

హిందూత్వ వాదిగా ఉన్న సంజయ్ ప్రసంగాన్నే ఆసక్తికరంగా ప్రారంభించారు. భారత మాతా కీ జై, జై శ్రీ రాం, రామ లక్షణ జానకీ జై బోలో హనుమాన్‌కి అంటూ ప్రసంగం మొదలుపెట్టాడు. నిస్సత్తువ లో ఉన్న పార్టీ శ్రేణులకు ఉత్సాహం తెప్పిస్తూ తన భవిష్యత్ లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలిపారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడమే తన ధ్యేయమని ప్రకటించారు. దీనికి ఇప్పటి నుంచే కష్టపడి 2023లో పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కరోనా భయం కాదు.. కమలం భయం పట్టుకుంది అని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి కేసీఆర్ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, నిధులు ఇవ్వడం లేదని చేస్తున్న విమర్శలకు స్పందించారు.

కేంద్రం వద్దకు వచ్చే దమ్ము కేసీఆర్‌కు ఉందా? వస్తే నిధులు ఇప్పించి దమ్ము నాకు ఉందని సవాల్ విసిరారు. మతతత్వ పార్టీ అంటూ హిందువులపై, అరాచకం అక్రమ కేసులు పెడితే ఖ‌బడ్దార్ కేసీఆర్ నీ గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు. బైంసా లో చిన్నారులు, మహిళలు, తమ్ముళ్లను కాపాడండి అంటూ పిలుపునిచ్చారు. మళ్లీ బైంసాకు వెళ్తా.. జైలుకు పంపిన తమ్ముళ్లను గుండెకు హత్తుకోవడానికి వెళ్తానని పేర్కొన్నాడు. కేసీఆర్ చేసే యాగాలపై స్పందిస్తూ నువ్వు చేసే యాగాలు నీ కొడుకుని సీఎం చేయడానికే కానీ హిందూ సమాజం కోసం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నువ్వు రాష్ట్రంలో పథకాలకు ఇచ్చే డబ్బు ఎవడబ్బ సొత్తు.. నీ అబ్బా సొత్తా.. తెలంగాణ ప్రజల సొమ్ము అని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బుల లెక్కలు కేసీఆర్ చెప్పాలని కోరారు. కేసీఆర్ మానవత్వం లేని మృగమని, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా.? త‌్వ‌రలో టీఆర్ఎస్ గడీలను కూల్చేస్తామని, మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా రాష్ట్రాన్ని ఏలాలని చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించుతామని తెలిపారు. ఖ‌బ‌డ్దార్‌ కేసీఆర్ ఈ రోజు నుంచే యుద్ధం మొదలైందని, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కరోనా వైరస్ పై చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించాడు. కేసీఆర్ కరోనా నివారణకు పారసేటమాల్ వేసుకోమన్నాడు. ఈ కేసీఆర్ పారాసేటమాల్ ఏంది అని దేశం మొత్తం నవ్వుతుందని తెలిపారు. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో కేసీఆర్ కె తెల్వదని పేర్కొన్నారు. త్వరలోనే పాదయాత్ర నిర్వహిస్తా.. రథయాత్రగా ప్రతి గ్రామం, మండలానికి వస్తా.. విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటానని బండి సంజ‌య్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
Tags:    

Similar News