ఆ సీఎం షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారిందెందుకు?

Update: 2020-04-01 04:00 GMT
మాటల్లో చెప్పలేని ఎన్నో భావాల్ని ఒక్క ఫోటో చెప్పేస్తుందంటారు. తాజాగా ఒక ఫోటోను చూసినప్పుడు ఇదే విషయం ఇట్టే అర్థమైపోతుంది. మహమ్మారి కరోనా వైరస్ ను కట్టడి చేయటంలో.. వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ప్రమాదం పక్కనే నిలుచొని పని చేయటం.. అది కూడా నాన్ స్టాప్ గా అంటే మాటలు కాదు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు డాక్టర్లు చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు. నిజానికి.. వారు చేస్తున్న త్యాగంపై సరైన రీతిలో దేశ ప్రజలు స్పందించలేదని చెప్పాలి.

యుద్ధ సమయాల్లో దేశ సరిహద్దుల్లో సైన్యం చేసే పోరుకు సమానమైన పోరాటాన్ని చేస్తున్నారు వైద్యులు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో భోపాల్ కు చెందిన చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ దేహరియాకు సంబంధించిన ఫోటో అది. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున పని ఒత్తిడి నేపథ్యంలో వరుసగా ఐదు రోజుల పాటు ఆయన ఇంటికి వెళ్లే అవకాశం లభించలేదు.

తాజాగా ఆయన ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యుల మధ్య టీ తాగారు. అయితే.. అందులో విశేషం ఏముందంటారా? ఆయన ఇంటి బయట.. ఉన్న అరుగు మీద కూర్చొని టీ తాగితే.. ఆయనకు చాలా దూరంగా.. గేటు దగ్గర భార్య.. పిల్లలు ఆయన్ను చూస్తుండగా టీ తాగారు. ఈ సందర్భంగా కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ఫోటో చూస్తే.. చాలు.. కరోనా మీద యుద్ధం చేస్తున్న వైద్యుల ఎంతటి త్యాగం చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఫోటోలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా తన ట్విట్టర్ లో పంచుకుననారు. వైద్యులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి.. ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు ఎంతలా కష్టపడుతున్నారో ఈ ఫోటో ఇట్టే చెప్పేస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News