మొన్న బిల్కిస్ బానో.. ఇప్పుడు చావ్లా.. దోషులు మాత్రం బ‌య‌ట‌కు!

Update: 2022-11-08 12:30 GMT
బిల్కిస్ బానో.. విష‌యం దేశాన్ని ఇంకా కుదుపేస్తూనే ఉంది. గుజ‌రాత్‌కు చెందిన ఈమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన దోషుల‌ను ఇటీవ‌ల గుజ‌రాత్ కోర్టు విడుద‌ల చేసింది. అయితే, వీరిని ఆర్ ఎస్ ఎస్ వ‌ర్గాలు ఘ‌నంగా స‌త్క‌రించిన విష‌యం.. మ‌రింత దుమారం రేపింది. ఒక యువ‌తిపై ఘోర అత్యాచారానికి పాల్ప‌డిన వారికి.. ఘ‌న స‌త్కారాలు చేయ‌డం ఏంట‌నే విస్మ‌యం వ్య‌క్త‌మైంది. రాజ‌కీయ దుమారం కూడా కొన‌సాగింది. ఇది ఇంకా మంట‌లు రేపుతున్న విష‌యం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా చావ్లా సామూహిక హత్యాచారం కేసులో ముగ్గురు దోషులను ఏకంగా సుప్రీంకోర్టు విడుద‌ల చేసేసింది. ట్రయల్ కోర్టు నుంచి  హైకోర్టు వ‌ర‌కు ఇచ్చిన తీర్పుల‌ను తోసిపుచ్చింది. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ వారికి విధించిన మ‌ర‌ణ శిక్ష‌ను కూడా ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు సీజేఐ జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో ప్ర‌జాస్వామ్య వాదులు నివ్వెర పోయారు.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు యువకులు 19 ఏళ్ల యువతి(చావ్లా)పై సామూహిక అత్యాచారం చేసి అనంతరం చిత్రహింసలకు గురిచేశారని.. దాంతో ఆమె మృతి చెందిందనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు.. ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధరించి మరణ శిక్ష విధించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును నిందితులు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు ఆ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది.

అయితే.. తమకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీం కోర్టు వారిని నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. ఈ కేసులో సోమవారం తుది తీర్పు ఇచ్చిన సీజేఐ జస్టిస్ యూయూ. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ముగ్గురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ, వారికి విధించిన మరణశిక్షను రద్దు చేసింది. దీంతో ప్ర‌జాస్వామ్య వాదులు.. మ‌హిళా సంఘాల నేత‌లు.. తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దేశంలో ఏం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News