బీజేపీ ఎదురుదాడి

Update: 2022-02-11 07:30 GMT
ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇక్క‌డి రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా టీఆర్ఎస్ ఎదిగింది. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. అలాంటి పార్టీకి ఇప్పుడు తెలంగాణ‌లో స‌వాలు ఎదుర‌వుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ పుంజుకోవ‌డంతో త్రిముఖ పోరులా ప‌రిస్థితి మారింది. ఇన్ని రోజులూ పెంచుకుంటూ వ‌స్తున్న పార్టీపై ప్ర‌త్య‌ర్థి దాడి చేస్తే కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? అందుకే బీజేపీని టార్గెట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

మోడీపై మాట‌ల యుద్ధాన్ని తీవ్ర‌త‌రం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీ వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేస్తున్నాయి.

పార్ల‌మెంట్‌లో మోడీ చేసిన వ్యాఖ్య‌లపై భ‌గ్గుమ‌న్న టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. అంత‌టితో ఆగ‌కుండా ఏకంగా ప్ర‌ధాని మోడీపైనే పార్ల‌మెంట్‌లో ప్రిలిలేజ్ మోష‌న్ నోటీసులు ఇచ్చింది.

రాజ్య‌స‌భ కార్య‌ద‌ర్శికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోష‌న్ నోటీసులిచ్చారు. తెలంగాణ ఏర్పాటు అంశంలో ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌పై ఫిర్యాదు చేశారు. స‌భా హ‌క్కులు ఉల్లంఘ‌న కింద రాజ్య‌స‌భ‌ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు, లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు టీఆర్ఎస్ నోటీసులు అంద‌జేశారు. అంతే కాకుండా రాజ్య‌స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత వెల్‌లోకి వెళ్లి తాము ఇచ్చిన నోటీసును స్వీక‌రించాల‌ని డిమాండ్ చేశారు. డిప్యూటీ ఛైర్మ‌న్ స్పందించ‌క‌పోవ‌డంతో వాకౌట్ చేశారు. లోక్‌స‌భ‌లోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ వాకౌట్ చేశారు.

టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ కూడా దీటుగానే స‌మాధానం ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంబేడ్క‌ర్ రాజ్యాంగం కావాలో లేదా క‌ల్వకుంట్ల రాజ్యాంగం కావాలో ఆలోచించుకోవాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ విన్న‌వించారు. రాష్ట్రంలో క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగాన్ని బీజేపీ అడ్డుకుని తీరుతుంద‌ని దాని కోసం ఎంత‌వ‌ర‌కైనా పోరాడుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేసీఆర్‌పై రానున్న రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాల్లో బీజేపీ ప్రివిలేజ్ మోష‌న్ ఇస్తుంద‌ని సంజ‌య్ పేర్కొన్నారు. రాజ్యాంగం మార్పు స‌హా కేసీఆర్ భాష‌పై ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.
Tags:    

Similar News