మిత్రుడికి మంటపుట్టే మాట !

Update: 2016-07-09 04:33 GMT
ఆశ తప్పేం కాదు. కానీ.. అదెప్పుడూ అత్యాశలా కనిపించకూడదు. తాజాగా బీజిపీ నేతలు తీరు చూస్తే.. మిత్రధర్మాన్ని తుంగలోకి తొక్కినట్లుగా కనిపిస్తుంది. విస్తరించాలన్న కాంక్ష తప్పు లేదు కానీ.. స్నేహ ధర్మాన్ని మర్చిపోకూడదు కదా. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగిరేలా చేయాలన్న ఆలోచన మంచిదే. కానీ.. కొన్ని రాష్ట్రాల్లో తాము మిత్రపక్షంతో కలిసి ఇప్పటికే అధికారాన్ని పంచుకుంటున్నా.. ఆ విషయాన్ని వదిలేసి.. మిత్రుడికి మంటపుట్టేలా.. తాము ఆయా రాష్ట్రాల్లో పవర్ లోకి రావాలన్న మాటను చెబుతున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్.. ఒడిశాలలో అధికారమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందన్న వ్యాఖ్యను తాజాగా బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ.. ఒడిశాలలో పార్టీ అధికారంలో రావాలనుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఆంధ్రప్రదేశ్ విషయమే వేరని చెప్పాలి. ఓపక్క ఏపీలో అధికారపక్షానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తూనే.. మరోవైపు ఆ రాష్ట్రంలో అధికారపక్షంగా అవతరించాలన్న తమ ఆలోచనను ఎలాంటి మెహమాటం లేకుండా చెబుతున్న తీరు చూస్తే.. మిత్రధర్మంలో కొత్త సందేహాలు తలెత్తేలా అమిత్ షా బ్యాచ్ ట్రై చేస్తుందనే చెప్పాలి.

తాజాగా బీజేపీ చీఫ్ తో సుదీర్ఘంగా భేటీ అయిన తెలంగాణ నేతలు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తమ లక్ష్యాల్ని.. ఆశల్ని..ఆకాంక్షల్ని చెప్పుకొచ్చారు. 2019లో తెలంగాణలో అధికారపక్షంగా అవతరించటమే లక్ష్యంగా తాము పని చేయనున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఏడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలన్న టార్గెట్ పెట్టుకొని పని ప్రారంభించిందని.. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కాగా.. ఒక రాష్ట్రంలో పవర్ లోకి వచ్చినట్లుగా చెప్పారు. మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ పవర్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పిన వారు.. తమ తదుపరి లక్ష్యం.. తెలంగాణ.. ఒడిశా.. ఆంధప్రదేశ్ అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. పవర్ లేని చోట అధికారాన్ని చేపట్టాలని అనుకోవటంలో తప్పు లేదు కానీ.. మిత్రపక్షంగా ఇప్పటికే అధికారంలో షేర్ ఉన్న రాష్ట్రంలో తానొక్కడినే ఎదగాలన్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా చేస్తాయన్న విషయాన్ని కమలనాథులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ బ్యాచ్ కు ఇలాంటి మాటలు తలకెక్కే పరిస్థితి ఉందా..?
Tags:    

Similar News