మద్దతు అవసరం లేదని చెప్పగలరా ?

Update: 2022-07-11 04:13 GMT
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని  వైసీపీని బీజేపీ అడగలేదని పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు. ఎన్డీయే తరపున పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము కు మద్దతివ్వాలని జగన్మోహన్ రెడ్డిని కేంద్రంలో ఎవరడిగారు ? ఎవరు అడగలేదని బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఒకవేళ నిజంగానే సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు నిజమనే అనుకుందాం. మరదే నిజమైతే ద్రౌపది మంగళవారం రాష్ట్రానికి ఎందుకు వస్తున్నట్లు ? వైసీపీ మద్దతు కావాలని స్వయంగా ద్రౌపది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు.

ఆ తర్వాతే మంగళవారం రాష్ట్రానికి వస్తున్నారు. మంగళవారం నాడు వైసీపీ ఎంపీలు, ఎంఎల్ఏలతో ఎన్డీయే అభ్యర్ధి సమావేశమవుతున్నారు. తర్వాత జగన్ తో కూడా భేటీ అవబోతున్నారు. ఇదంతా ద్రౌపది ఎవరి తరపున చేస్తున్నారు ? అసలు ద్రౌపదికి వైసీపీ అయినా ఇంకో పార్టీ అయినా మద్దతు ఎందుకు ప్రకటించాయి. ఈమె వెనుకున్న నరేంద్రమోడీని చూసే మద్దతిస్తున్న విషయం అందరికీ తెలుసు.

మోడీ క్యాండిడేట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా ద్రౌపది పోటీచేసుంటే అసలు ఆమెకు ఎవరైనా మద్దతిచ్చేవారేనా ? తనకు మద్దతు ఇవ్వాలని ద్రౌపది వివిధ పార్టీలను అడుగుతున్నారంటేనే మోడీ మద్దతు అడుగుతున్నట్లే లెక్క. బీజేపీకి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వైసీపీ తమకు అంటరాని పార్టీ అని సత్యకుమార్ చెప్పారు. అలాగయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో వైసీపీ మద్దతు అవసరం లేదని ప్రకటించగలరా ?

వైసీపీ అంటరాని పార్టీ అయినపుడు మద్దతు కూడా అవసరం లేదని డైరెక్టుగా చెప్పేసుండాల్సింది. అలా చెబితే తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో సత్యకుమార్ కు తెలిసేది. ద్రౌపది నామినేషన్ వేసినపుడు కేంద్రం నుండి అందిన ఆహ్వానం కారణంగానే వైసీపీ  తరపున ఎంపీలు హాజరైన విషయాన్ని బీజేపీ నేతలు మరచిపోయారేమో. వైసీపీ-బీజేపీ మధ్య సయోధ్య లేదని గొంతు చించుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య సయోధ్య ఉందని ఎవరన్నారసలు ?
Tags:    

Similar News