ఏపీలో 'బీజేపీ ప్లాన్' బి రెడీ

Update: 2019-11-14 09:43 GMT
కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఆధిపత్యం సాధించేందుకు వేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు. కానీ కొన్ని ఫెయిల్ అయిన నేపథ్యం లో ఇప్పుడు 'ప్లాన్ బి' అమలు చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఏపీలో వైసీపీ అఖండ మెజార్టీ తో గద్దెనెక్కడం తో ఇప్పుడు ఆ పార్టీని ఢీ కొట్టే సామర్థ్యం టీడీపీ లో లేదని బీజేపీ భావిస్తోంది.. టీడీపీ అధినేత చంద్రబాబు కు వయసు మీద పడడం.. ఆయన వారసుడు లోకేష్ అసమర్థత కారణంగా టీడీపీ లో రాజకీయ భవిష్యత్తు లేదని నేతలంతా వలస పోతున్నారు. ఈ వలసలను వైసీపీలోకి వెళ్లకుండా బీజేపీలోకి రాబట్టుకోవాలని బీజేపీ ప్లాన్ చేసినట్టు తెలిసింది.

అయితే ఎంత ప్రయత్నించినా పేరున్న పెద్ద నేతలు ఎవరూ ఇప్పటివరకూ బీజేపీ లో చేరింది లేదు. టీడీపీ లో తీవ్రమైన ఆర్థిక నేరాలు, సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొన్న రాజ్యసభ ఎంపీలు మాత్రమే బీజేపీ లో చేరారు. వారి వ్యాపార ప్రయోజనాల కోసమే పార్టీ మారారనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక వీరు ప్రజా నాయకులు.. ప్రజలను ప్రభావితం చేసే నేతలు కాదు. చంద్రబాబు దయతో ఆర్థిక వనరుల తో ఎంపీ పదవులు కొట్టేసిన వారేనని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఏపీ లో బలపడాలంటే  పేరున్న నేతలు కావాలని బీజేపీ అన్వేషణ కొనసాగిస్తోందట.

అయితే కునారిల్లిన టీడీపీ ని బతికించడం.. నేతల వలసలను అరికట్టేందుకు చంద్రబాబు తాజాగా 'ఇసుక కొరత ' ఉద్యమాన్ని అందుకున్నాడు. ఇక జిల్లాల్లో పర్యటిస్తూ సమీక్షలు చేస్తూ నేతల కు భరోసానిస్తున్నారు.  ఇది టీడీపీ ఫిరాయింపులను దాదాపు గా నిలిపివేసిందనే చెప్పాలి.

ఇక జగన్ వైఖరి కూడా చంద్రబాబు కు అదృష్టం గా మారింది. టీడీపీ నేతలు వస్తామంటున్నా వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈ ఫిరాయింపు రాజకీయాలకు దూరంగా ఉండడం టీడీపీ అధినేత కు వరం గా మారింది.. ఆయన ద్వారాలు తెరిస్తే టీడీపీ దుకాణం మూత పడడం ఖాయం. కానీ క్లీన్ పాలిటిక్స్ కోసం జగన్ టీడీపీ నేతల ను చేర్చుకోవడం లేదు. దీంతో ఇప్పుడు టీడీపీని వీడాలనుకునే వారికి బీజేపీ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే టీడీపీ ని ఫినిష్ చేసి ఏపీలో ప్రతిపక్షంగా ఎదగడానికి బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలిసింది.

తాజాగా టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తో పాటు కొందరు ముఖ్య నాయకులను, 9 మంది వరకు టీడీపీ ఎమ్మెల్యే లను బీజేపీ లో చేర్చుకోవడానికి ఢిల్లీ పెద్దలు రెడీ అయ్యారట.. అంతేకాదు.. కేంద్రం లోని బీజేపీ ఇప్పుడు తనదగ్గరున్న అస్త్రాలను బయటకు తీయబోతోందట.. ఐటీ, ఈడీ, సీబీఐల ద్వారా టీడీపీకి ఆర్థిక అండ దండలు అందిస్తున్న వారి మూలాలను దెబ్బ తీయడానికి రెడీ అయ్యిందట.. టీడీపీ కి బ్యాక్ బోన్ గా ఉన్న వారి పై త్వరలోనే దాడులు చేసి వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో మిగతా టీడీపీ నేతలనంతా బీజేపీ లోకి చేర్చుకోవడానికి ఈ బెదిరింపుల రాజకీయం మొదలు పెట్టినట్లు సమాచారం. మరి ఈ ప్లాన్లు వర్కవుట్ అవుతాయా.. టీడీపీ ఖేల్ ఖతమవుతుందా లేదా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News