బొండా ఉమ కాన్ఫిడెన్స్ మరీ ఇంత ఎక్కువా?

Update: 2016-03-27 16:50 GMT
దూకుడు రాజకీయాలు వచ్చిన తర్వాత నేతల నోట్లో నుంచి ఏ మాట వస్తుందో కూడా పట్టించుకోవటం పూర్తిగా మానేసినట్లున్నారు. ఏమైతేనేం అన్నట్లుగా ఉందే తప్పించి.. అసలిలా మాట్లాడొచ్చా? లేదా? అన్న ప్రశ్న వేసుకోవటం కూడా లేకుండా పోతోంది. ప్రత్యర్థి పార్టీ కంటే ఘాటుగా తిట్టానా? లేదా? అన్నదే లెక్క తప్పించి.. నోట్లో నుంచి వచ్చే మాటలకు ఓ విలువ ఉంటుందని.. దాని కోసమైనా ఆచితూచి మాట్లాడాలన్న ధ్యాస లేకుండా పోతోంది.

తాజాగా ఏపీ అధికారపక్షానికి చెందిన బొండా ఉమ మాటలే దీనికి నిదర్శనం. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టినా.. అలాంటి జంకూబొంకు ఏమీ లేని బొండా ఉమ చెలరేగిపోతున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్ మీద కానీ.. జగన్ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడటమంటే చాలు ఆయనలో ఉత్సాహం పొంగి పొర్లుతుంది. తాజాగా జగన్ మీద విరుచుకుపడిన ఆయన.. ప్రజల అభివృద్ధి కోసం తమ సర్కారు తీవ్రంగా కృషి చేస్తుంటే.. విపక్ష నేత వైఎస్ నేత మాత్రం నిత్యం కుట్రలు.. కుతంత్రాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్షం అనవసరంగా సమయం వృధా చేస్తుందని.. అయితే అవిశ్వాసం లేదంటే రోజా విషయం తప్పించి జగన్ కు మరెలాంటి సమస్యా గుర్తుకు రావటం లేదంటూ విరుచుకుపడ్డారు. ఏపీ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించటం ఖాయమని.. జగన్ కుట్రలు ప్రజలు ఇప్పటికే చూస్తున్నారని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో జగన్ ఏకాకిగా మిగలటం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో అటు కాంగ్రెస్ లేక.. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే మిగులుతుందని బొండా ఆశ పడుతున్నారు. విపక్షంలేన అధికారపక్షంగా ఉండాలని కోరుకుంటున్న బొండా ఉమ లాంటి వారు నేతలు కావటం ఏపీ చేసుకున్న అదృష్టంగా భావించాలా..?
Tags:    

Similar News