ప్రధాని డిశ్చార్జి.. కానీ పదివేల ప్రాణాలు పోయాయి

Update: 2020-04-13 03:15 GMT
సామాన్యుడు.. సెలబ్రిటీ అన్న తేడా లేకుండా.. ఎవరికైనా సోకే కరోనాతో యావత్ ప్రపంచం ఎంతలా ప్రభావితమైందో చూస్తున్నదే. సంపన్న దేశాలు.. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లోనూ కరోనాను కంట్రోల్ చేయలేక వేలాది మంది మరణిస్తున్న దుస్థితి. ఇలాంటివేళ.. బ్రిటన్ ప్రధానమంత్రి కరోనా బారిన పడటం.. ఆయన ఆరోగ్యం విషమించటం తో అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి.. ఐసీయూలో సేవలు అందించారు. గడచిన కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం విషయంలో వైద్యులు చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చాయి. ఆయన ఆరోగ్యం కుదుట పడటమేకాదు.. కరోనా నుంచి కోలుకుంటున్నారు. దీంతో.. ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో.. బ్రిటన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రిటన్ లో కరోనా తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇప్పుడా దేశంలో కరోనా మరణాలు పది వేలకు పైనే చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఇప్పటివరకూ యునైటెడ్ కింగ్ డమ్ లో 10,610 మంది కరోనా కారణంగా మరణించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడా దేశంలో 84 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది వేలకు పైగా ప్రజల్ని పోగొట్టుకున్న దేశాల జాబితాలో బ్రిటన్ తాజాగా చేరింది. ఇప్పటివరకూ భారీగా నష్టపోయిన దేశాల జాబితాలో బ్రిటన్ చేరింది. ఇప్పటికే పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన దేశాల్లోకి వస్తే తొలి స్థానంలో అమెరికా నిలువగా.. రెండో స్థానంలో స్పెయిన్ మూడో స్థానంలో ఇటలీ.. తర్వాతి స్థానంలో ఫ్రాన్స్ నిలిచాయి. ఆదివారం చోటు చేసుకున్న మరణాలతో బ్రిటన్ సైతం ఈ జాబితాలో చేరింది.  

ఇదిలా ఉంటే.. తనకు వైద్య సేవలు అందించిన సెయింట్ థామస్ ఆసుపత్రి సిబ్బందిని ఆకాశానికి ఎత్తేశారు ప్రధాని బోరిస్ జాన్సన్. తన జీవితాంతం వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని చెప్పారు. మరో వైపు ప్రధాని ఆరోగ్యం కుదుట పడిందని.. ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు చెప్పారు. త్వరలోనే ఆయన ప్రధాని విధుల్ని పాటిస్తారని చెబుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయట పడినా.. పది వేలకు పైగా ప్రాణాల్ని కోల్పోయిన వైనం పై మాత్రం ఆయన వేదనలో ఉన్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News