ఏపీలో బీయారెస్ సంక్రాంతి....కేసీయార్ గ్రాండ్ ఎంట్రీ

Update: 2022-12-14 16:30 GMT
సంక్రాంతి తెలుగు వారి పెద్ద పండుగ. ఆంధ్రా వారు అత్యంత ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణా రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చిన కేసీయార్ మంచి దూకుడు మీద ఉన్నారు. అమరావతిలోనే పార్టీ ఆఫీస్ ని ఆయన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని కోసం తెర వెనక ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని ఆయన ఏపీకి పంపించి పార్టీకి ఒక రూపు తీసుకువచ్చేలా చూస్తున్నారు.

తలసాని శ్రీనివాస యాదవ్ ఏపీలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. పైగా ఏపీలో ఉన్న తెలుగుదేశం నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఒక బిగ్ షాట్ తో ఆయనకు ఏకంగా చుట్టరికం ఉందని చెబుతారు. ఇక రెండు రాష్ట్రాలు విడిపోయినా ఏపీలో సన్నిహిత సంబంధాలు కొనసాగించే వారిలో తలసాని అతి ముఖ్యుడు. ఆయన ప్రతీ సంక్రాంతికి ఏపీకి వచ్చి కోడి పందేలలో పాలు పంచుకుని వెళ్తూంటారు. అదే విధంగా టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. దాంతో ఆయనకు ఆంధ్రా కొత్త ఎప్పటికీ కాదు.

అందుకే కేసీయార్ అన్నీ ఆలోచించి తలసానిని ఏపీలో బీయారెస్ పనులు చూడాలని పురమాయించారని చెబుతున్నారు. తలసాని కూడా మంచి చతురుడు. కేసీయార్ మదిలో ఉన్న దాన్ని ఆచరణలో పెట్టే సమర్ధుడు. దాంతో ఆయన ఇప్పటికే ఫోన్ ద్వారా ఏపీలోని వివిధ పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారని అంటున్నారు. బీయారెస్ లోకి కీలకమైన నేతలను, వివిధ సామాజికవర్గ నేతలను ఆహ్వానించే పనిలో తలసాని ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు.

రెండు ప్రధాన సామాజిక వర్గాలని, బీసీలను టార్గెట్ చేస్తూ ఏపీలో బీయారెస్ తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది అని అంటున్నారు. బీసీలలో అతి పెద్ద సామాజికవర్గంగా యాదవులు ఉన్నారు. అదే విధంగా వెలమలు కూడా  ఉత్తరాంధ్రాలో కీలకమైన పాత్ర పోషిస్తారు. వీరితో పాటుగా సీమలో ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన వారు హైదరాబాద్ లో వివిధ వ్యాపారాలలో పై చేయిగా ఉన్నారు. వారంతా చాలా కాలంగా టీయారెస్ తో కలసి సాగుతున్నారు.

ఇలా కోస్తా రాయలసేమ, ఉత్తరాంధ్రాలోని ఆయా వర్గాలను ముందు పెట్టుకుని బీయారెస్ ఏపీ రాజకీయం మీద తన ఆధిపత్యం చూపించాలనుకుంటోంది. అదే టైంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా లోక్ సభ ఎన్నికల మీదనే బీయారెస్ దృష్టి పెడుతుంది అని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎవరికి ఫేవర్ గా బీయారెస్ ఉంటుందో ఇప్పటికైతే ఆ గుట్టు చెప్పడంలేదు కానీ లోక్ సభ సీట్లు కనీసం నాలుగు గెలుచుకోవాలని చూస్తోంది. అదే విధంగా ఆరు శాతం ఓటింగ్ అన్నది ఏపీలో సాధించడమే బీయారెస్ ముందున్న కర్తవ్యం.

దాంతో కొత్త ఏడాది నుంచి సరికొత్త రాజకీయానికి బీయారెస్ రెడీ అవుతోంది అని అంటున్నారు. ఏపీలో సంక్రాంతి కోలాహాలం తగ్గిన తరువాత కేసీయార్ గ్రాండ్ లెవెల్ లో ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. అంటే కేసీయార్ రాకతో బీయారెస్ రాజకీయ సంక్రాంతిని తెస్తుందని చెబుతున్నారు. ఏపీ జనాల సెంటిమెంట్, ఇక్కడ సామాజిక సమీకరణలు, ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల బలం, బలహీనతలు అన్నీ బాగా తెలిసిన నేతగా కేసీయార్ ఉన్నారు. దాంతో పాటుగా ఆయన రాజకీయ చాణక్యుడు కావడంతో ఏపీ రాజకీయాన్ని తన చేతుల్లోకి తీసుకుంటారని అంటున్నారు.

కేసీయార్ మంచి మాటకారి కావడంతో ఏపీ జనాలను తన వైపునకు తిప్పుకుంటే మాత్రం ఆంధ్రా పార్టీలకు చిక్కులు తప్పవనే అంటున్నారు. ఇప్పటికే విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు కేసీయార్ పార్టీ హడావుడిని తెలియచేస్తున్నాయి. అర్ధ బలంతో దూసుకుపోయే సామర్ధ్యం ఉన్న బీయారెస్ లో చేరేందుకు ఆ దిశగా కూడా కీలక నేతలు ప్రయత్నాలు మొదలెడుతున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే తెలుగుదేశం నుంచి కూడా వలసలు పెద్ద ఎత్తున ఉంటాయని అంచనా కడుతున్నారు.

మొత్తానికి చూస్తే కేసీయార్ 2024 ఎన్నికల్లో ఏపీ నుంచి తన రాజకీయ వాటాను గట్టిగానే కోరుకుంటున్నారు. కనీసంగా  నలుగురు, గరిష్టంగా ఆరుగురు ఎంపీలను గెలిపించుకుంటే జాతీయ జెండాను ఢిల్లీలో ఎగరేసినట్లే అని కేసీయార్ అంచనా వేసుకుంటున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం కేసీయార్ జాతీయ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఆ సన్నాహాలలో  ఆయన తీరిక లేకుండా ఉన్నారు. అక్కడ నుంచి ఆయన రాగానే ఏపీ మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు.

ఏపీకి సంబంధించి తలసానికి అప్పగించిన బాధ్యతల నేపధ్యంతో ఆయనతో మరోసారి సమావేశం జరిపి దిశాన్రిదేశం చేస్తారని అంటున్నారు. ఏపీ,  కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలను టార్గెట్ చేస్తూ బీయారెస్ ని కదం తొక్కించాలని కేసీయార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. మరి ఆయన కోరిక ఎంతమేరకు తీరుతుంది అన్నది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News