కేటీయార్ యూత్, గుడివాడ!

Update: 2022-10-15 11:30 GMT
కేసీయార్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్  పార్టీ హడావుడి ఏపీలో కనిపిస్తోంది.  తాజాగా గుడివాడలో బీఆర్ఎస్ కు మద్దతుగా వెలసిన పెద్ద పోస్టర్ల ను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

కేటీయార్ యూత్ పేరుతో గుడివాడ పట్టణంలో వెలసిన పెద్ద పోస్టర్ లో కేసీయార్, కేటీయార్, హరీష్ రావు ఫోటోలు ప్రముఖంగా ప్రింట్ చేశారు. ఎవరో స్వీట్ షాప్, బేకరీ యజమాని సదరు పోస్టర్ ను ప్రింట్ చేయించి అంటించినట్లుంది.

బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన మరుసటి రోజే అమలాపురంలో కూడా భారీ పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. పైగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గానికి బీఆర్ఎస్ తరపున పోటీచేయబోతున్నట్లు అమ్మాజీ డబల్ అనే వ్యక్తి ఫొటో ముద్రించిన పోస్టర్ కలకలం సృష్టించింది. కేసీయార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ను అసలు ఏపీలో ఎవరు పట్టించుకుంటారు ? ఎవరు ఆదరిస్తారు ? అనే చర్చ మొదట్లో జరిగింది.

ఈ చర్చల సరళిని చూసిన జనాలు నిజమే అనుకున్నారు. అయితే పార్టీ ఏర్పాటును కేసీయార్ ప్రకటించగానే పోస్టర్లు వెలవటం చూసిన తర్వాత అంతర్లీనంగా జనాల ఆదరణ ఉందని బయటపడుతోంది.

దీనికితోడు జనవరిలో విజయవాడలో బీఆర్ఎస్ బహిరంగసభ జరగబోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈలోగానే కొందరు సీనియర్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే ఉద్దేశ్యంతోనే కేటీయార్, తలసాని శ్రీనివాసయాదవ్ కు కేసీయార్ బాధ్యతలు అప్పగించారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఉత్తరాంధ్రలో కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, కడపలో డీఎల్ రవీంద్రారెడ్డితో బీఆర్ఎస్ ముఖ్యులు టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవముందో తెలీదు కానీ కాంగ్రెస్, టీడీపీలోని సీనియర్ నేతలతో తలసారి, కేటీయార్ టచ్ లో ఉన్నదిమాత్రం వాస్తవమే అని చెబుతున్నారు. పోస్టర్లు వేయటం పెద్ద విషయం కాదుకానీ ఎన్నికల్లో పోటీచేస్తే ఓట్లు పడతాయా అన్నదే అసలైన పాయింట్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News