జగన్ బెయిల్ రద్దు చేయండి.. వైసీపీ ఎంపీ రఘురామ పిటిషన్

Update: 2021-04-06 10:37 GMT
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ మరోసారి వార్తల్లోకి వచ్చారు. సొంత పార్టీ అధినేతపై తరచూ ఏదో ఒక వ్యాఖ్య చేసే ఆయన.. తాజాగా తన చేతలకు పని చెప్పారు. ఇప్పటివరకు పార్టీ అధినేతపై పరోక్షంగా చురకలు వేసే ఆయన.. తాజాగా మాత్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డపేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే తాను పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఓవైపు హైకోర్టులో పార్టీ అధినేత బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. మరోవైపు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇన్ని ఛార్జిషీట్లు వేసినా.. ట్రయల్ ఆలస్యంగా జరుగుతోందన్నారు.

కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని.. సీఎం జగన్ ను త్వరగా కేసుల నుంచి బయటపడేయాలన్న ఉద్దేశంతోనే తాను కేసులు వేసినట్లుగా పేర్కొన్నారు. త్వరగానే కేసు తేలిపోతుందన్న నమ్మకం ఉందన్నారు. రాజకీయ ప్రత్యర్థులు పలు రకాలుగా మాట్లాడటం బాధాకరమని.. అలాంటి వారికి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే తాను హైకోర్టు తలుపు తట్టినట్లుగా పేర్కొన్న తీరు రోటీన్ కు భిన్నంగా ఉందని చెప్పాలి.

అధినేతకు ఇబ్బంది కలిగేలా మాట్లాడుతూనే.. టెక్నికల్ గా చూసినప్పుడు తప్పేం చెప్పలేదుగా? అన్నట్లుగా వ్యవహరించే రఘురామ ధోరణి వైసీపీ నేతలకు ఒక పట్టాన జీర్ణించుకోలేనిదిగా ఉంటుందని చెప్పాలి. కోర్టుకు వెళ్లకపోవటం.. అనుమానించే విధంగా ఉందన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని.. పార్టీని రక్షించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతూ అదిరిపోయే ఉదాహరణను ప్రస్తావించటం గమనార్హం.

గతంలో జయలలిత.. లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినట్లే జగన్ కూడా వేరే వారికి అవకాశం ఇచ్చి కేసుల నుంచి బయటపడాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు తీరు చూస్తే.. కర్ర విరగకుండా.. పాము చావకుండా వ్యవహరించే ధోరణి కనిపించక మానదు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంపై పార్టీ ఏ తీరులో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.




Tags:    

Similar News