కోడెల కూతురు మెడ‌కు కే ట్యాక్స్‌ ... కేసు న‌మోదు

Update: 2019-06-09 07:29 GMT
టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ మాజీ స్పీక‌ర్ కోడెల శివప్ర‌సాద్ వివాదాల పుట్ట ప‌గులుతోంది. టీడీపీ హ‌యాంలో స్సీకర్ ప‌ద‌విని ద‌క్కించుకున్న కోడెల వివాదాల‌కు దూరంగా ఉంటూ ఆ ప‌ద‌వికి వ‌న్నె తీసుకురావాల్సింది పోయి..సాధార‌ణ ఎమ్మెల్యేల కంటే కూడా త‌న‌దైన శైలిలో వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారారు. స్పీక‌ర్ ప‌ద‌విలో ఉన్న కోడెల పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల్సి ఉండ‌గా...అందుకు విరుద్ధంగా చంద్ర‌బాబు విగ్ర‌హాల‌కు పాలాభిషేకాలు చేస్తూ దొరికిపోయారు. ఇక కోడెల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయ‌న కుమారుడు శివ‌రాం త‌న‌దైన శైలిలో వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డార‌ని - కోడెల ట్యాక్స్ పేరిట కే ట్యాక్స్ అంటూ ఆయ‌న చేసిన వ‌సూళ్ల‌తో సత్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో పాటు న‌రస‌రావు పేట ప్ర‌జ‌లు కూడా నానా ఇబ్బందులు ప‌డ్డారు. ఈ క్ర‌మంలో తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుగా ఓడి, వైసీపీ బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించినా...కే ట్యాక్స్ వ‌సూళ్లు ఆగ‌లేద‌ట. ఈ క్ర‌మంలో నిన్న కోడెల శివ‌రాంపై కేసు న‌మోదు కాగా...ఆ త‌ర్వాత కోడెల కుమార్తె విజ‌య‌ల‌క్ష్మిపై కూడా కేసు న‌మోందైందట‌. కోడెల కుమారుడి గురించి ఇంత‌కుముందే తెలిసినా... ఇప్పుడు కొత్త‌గా కోడెల కుమార్తె కూడా కే ట్యాక్స్ అమ‌లులో త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

కోడెల కుమార్తెపై న‌మోదైన కేసు విష‌యానికి వ‌స్తే...గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులు, అమాయకుల భూములపై కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కన్నేసి.. లేని వివాదాలను సృష్టించి ‘కే’ ట్యాక్స్‌ వసూలు చేశారట‌. కేసానుపల్లిలో రోడ్డు వెంట పద్మావతికి ఉన్న విలువైన ఎకరా భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్నుపడిందని స‌మాచారం. రెండేళ్ల కిందట ఆమె ఆంతరంగికుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ముఖ్య అనుచరుడు కళ్యాణం రాంబాబు ఆ పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించార‌ట‌.

ముందుగానే సృష్టించిన నకిలీ పత్రాలను చూపించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కొనుగోలు చేసిందని, మరోమారు భూమి వద్దకు వస్తే హతమారుస్తామని బెదిరించారట‌. విజయలక్ష్మి వద్దకు వెళ్లి ముడుపులు (కే ట్యాక్స్‌) చెల్లించి వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని, లేకుంటే పొలానికి ఫెన్సింగ్‌ వేస్తామని బెదిరించార‌ట‌. దీంతో బాధితురాలు, కుమారుడు గోళ్లపాడులోని సేఫ్‌ కంపెనీ వద్దకు వెళ్లి విజయలక్ష్మిని కలిశారట‌. పొలం విడిచి వెళ్లాలని, లేకుంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని విజ‌య‌ల‌క్ష్మి డిమాండ్‌ చేశారట‌. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని, అవి కూడా విడతల వారీగా కడతామని ఒప్పందం చేసుకున్నారట‌.

అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారట‌. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబాబుల్‌ తోటను నరికించేందుకు పొలం యజమాని పద్మావతి - ఆమె భర్త వెళ్లగా రాంబాబు, శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని - లేకుంటే చంపుతామని బెదిరించారట‌. దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయార‌ట‌. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి - ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలసి దాడికి పాల్పడ్డారు దీంతో ఇక లాభం లేద‌నుకున్న బాధితులు న‌ర‌స‌రావుపేట‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విజయలక్ష్మి, ఆమె అనుచరులు కళ్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై షేక్‌ మహ్మద్‌ షఫీ తెలిపారు.
  


Tags:    

Similar News