ప్ర‌తి ఇంటా జెండా.. కుంభ‌కోణం ఏమైనా దాగుందా?

Update: 2022-07-29 08:52 GMT
మ‌న‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి ఈ ఏడాదికి 75 ఏళ్లు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ భవనాలతోపాటు 20 కోట్ల ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయం తీసుకుంది. వ‌చ్చే నెల ఆగ‌స్టు 13 నుంచి 15 వ‌ర‌కు హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నుంది. ఈ మూడు రోజులు . ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, టోల్ ప్లాజాలు, పోలీస్ స్టేషన్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని యోచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ ఇప్ప‌టికే విజ్ఞప్తి చేశారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా జాతీయ జెండాల కొనుగోలు అంటూ ఒక్కొక్కొరి నుంచి రూ.9 నుంచి రూ.25 వ‌ర‌కు వ‌సూలు చేస్తోంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. 20 కోట్ల ఇళ్ల‌పై జాతీయ జెండాలు ఎగుర‌వేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్నా దేశంలో ప్ర‌స్తుతం 4 కోట్ల జెండాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం.. మూడు పరిమాణాల్లో జెండాలు అందుబాటులో ఉన్నాయ‌ని సమాచారం. వీటి కోసం రూ.9, రూ.18, రూ.25ను వసూలు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

జ‌మ్ముకశ్మీర్ లోని ల‌డ‌క్ లో ఇప్ప‌టికే అధికారులు త‌మ కింది స్థాయి అధికారుల‌కు జెండాలు కొనుగోలు చేయ‌డానికి స్కూలు పిల్ల‌లు న‌గ‌దు వ‌సూలు చేయాల‌ని ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఈ మేర‌కు పీడీపీ నాయ‌కురాలు, మాజీ ముఖ్య‌మంత్రి మెహ‌బాబా ముఫ్తీ ట్వీట్ చేశారు. అధికారుల ఉత్త‌ర్వుల‌కు సంబంధించిన లెట‌ర్ ను కూడా ఆమె ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. ఆ లెట‌ర్ లో జెండా కొనుగోలుకు ఒక్కో స్కూల్ విద్యార్థి నుంచి రూ.20 వ‌సూలు చేయాల‌ని ఉంది.

జాతీయ జెండాల‌ను ప్ర‌భుత్వ‌మే ఉచితంగా అందించాల్సి ఉండ‌గా ప్ర‌జ‌ల నుంచి జెండా కొనుగోలు కోసం డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం దారుణ‌మ‌ని కాంగ్రెస్, తృణ‌మూల్ కాంగ్రెస్, తదిత‌ర పార్టీలు మండిప‌డుతున్నాయి. ఇందులో కుంభ‌కోణం ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆరోపిస్తున్నాయి. 20 కోట్ల జెండాల‌కు 20 రూపాయ‌ల చొప్పున వేసుకున్నా రూ.400 కోట్లు అవుతుంద‌ని, పోనీ క‌నీసం ఒక్కో జెండా రూ.10 చొప్పున లెక్క వేసుకున్నా రూ.200 కోట్లు అవుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

కాగా ఈ జెండాలను త‌యారుచేయ‌డానికి కేంద్రం ప‌లు సంస్థ‌ల‌కు ఇప్ప‌టికే ఆర్డ‌ర్లు ఇచ్చింద‌ని చెబుతున్నారు. రాష్ట్రాలు కోరుతున్న‌ట్టు కొన్ని కోట్ల జెండాల‌ను పూర్తి ఉచితంగా తాము స‌ర‌ఫ‌రా చేయ‌లేమ‌ని కేంద్రం చెబుతోంది. వాటిని రాష్ట్ర ప్ర‌భుత్వాలే కొనుగోలు చేసి ప్ర‌జ‌ల‌కు విక్ర‌యించుకోవ‌చ్చ‌ని చెబుతోందని అంటున్నారు.  

ప్ర‌భుత్వం నుంచి ఆర్డ‌ర్లు పొందిన సంస్థ‌లు జెండా తయారీ చేసి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అందిస్తాయ‌ని స‌మాచారం. ప్రజలు డబ్బులు పెట్టి జెండాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు జెండాల త‌యారీ పేరుతో కార్పొరేట్ కంపెనీల‌కు ల‌బ్ధి చేకూర్చ‌డానికి ఈ జెండాల తయారీ కార్య‌క్ర‌మాన్ని తెచ్చార‌ని ఆరోపిస్తున్నారు. పాలిస్ట‌ర్, సిల్క్, కాట‌న్, మెషిన్ వ‌స్త్రాల‌తోనూ జెండాలు త‌యారుచేయొచ్చ‌ని కేంద్రం ఫ్లాగ్ కోడ్ లో గ‌తంలోనే మార్పులు తెచ్చింద‌ని వివ‌రిస్తున్నారు.

దీని ప్ర‌కారం రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్.. పాలిస్ట‌ర్ ఇండ‌స్ట్రీస్ లో పాతుకుపోయింద‌ని.. ఇప్పుడు ఈ జెండాల త‌యారీ కూడా దానికి ల‌బ్ధిని చేకూర్చ‌డానికేన‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.
Tags:    

Similar News