మోడీ మార్క్‌:త‌మ్ముడు..త‌మ్ముడే పేకాట పేకాటే

Update: 2017-04-11 09:13 GMT
నిన్న ఢిల్లీలో జ‌రిగిన ఎన్డీయే కూట‌మి స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు భారీప్రాధాన్య‌త ల‌భించిందంటూ కొన్ని మీడియా సంస్థ‌లు ప్ర‌త్యేక క‌థ‌నాలు రాసేశాయి. త‌మ వాద‌న‌కు ద‌న్నుగా కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చూపించాయి. భోజ‌నాల ద‌గ్గ‌ర మోడీ.. బాబు.. అమిత్‌ షా.. లాంటోళ్లు ప‌క్క‌నే కూర్చున్నార‌ని.. తినే స‌మ‌యంలో కాస్త ప‌క్క‌కు తీసుకెళ్లి బాబుతో మోడీ ఏకాంతంగా మాట్లాడార‌ని.. తిరిగి వ‌చ్చేట‌ప్పుడు కాస్త దూరం బాబుతో క‌లిసి ప్ర‌ధాని మోడీ వ‌చ్చారంటూ చెప్పారు. ఇది జ‌రిగి 24 గంట‌లు కూడా కాక ముందే.. ఆంధ్రోడి గుండె మండే విష‌యం అధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఏపీ ద‌శ‌ను.. దిశ‌ను మారుస్తుంద‌న్న అంచ‌నా ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి మోడీ స‌ర్కారు ఏపీకి భారీషాక్‌ నే ఇచ్చింది. ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం పెరిగితే.. దాన్ని ఏపీ రాష్ట్రమే భ‌రించాల‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. సోమ‌వారం రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు అడిగిన లిఖిత‌పూర్వ‌క ప్ర‌శ్న‌కు మంత్రి ఉమాభార‌తి స‌మాధాన‌మిస్తూ.. ఏప్రిల్ 2014 నాటి ధ‌ర‌ల ప్ర‌కారం సాగునీటి నిర్మాణ అంచ‌నా వ్య‌యం పెరిగితే.. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రించాల్సి ఉంటుంద‌ని ఉమాభార‌తి స్ప‌ష్టం చేశారు.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం పోల‌వ‌రం నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కేంద్రానికే అప్ప‌గించి ఉంటే ఈ ప్రాజెక్టు ఇప్ప‌టికే ఒక కొలిక్కి వ‌చ్చి ఉండేది. కానీ.. నిర్మాణ బాధ్య‌త‌ల‌ను రాష్ట్రానికి ఇచ్చేలా కేంద్రాన్ని అడ‌గ‌టంతో కేంద్రం ఓకే అంది. ఏప్రిల్ 1, 2014 నుంచి చేసిన ఖ‌ర్చును మాత్ర‌మే రీయింబ‌ర్స్ మెంట్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఆ నిధుల‌ను నాబార్డు చేత రుణ‌సాయం ఇప్పిస్తామ‌ని తేల్చి చెప్పింది.

ఇదిలా ఉంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యాన్ని పెంచుతూ ఏపీ స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌లు పంపింది. క‌మిష‌న్ల క‌క్కుర్తితోనే ఆ ప‌ని చేసింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఓప‌క్క పోల‌వ‌రం నిర్మాణాన్ని 2019 నాటికి ముందే పూర్తి చేయ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెబుతున్నా.. అందుకు త‌గ్గ‌ట్లుగా బ‌డ్జెట్ కేటాయింపులు లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ పెరిగే అంచ‌నా వ్య‌యం.. చివ‌ర‌కు ఏపీ స‌ర్కారుకే చుట్టుకుంటుంద‌న్న చేదు నిజాన్ని తాజాగా కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.

తాజాగా ఉమాభార‌తి చెప్పిన మాట ప్ర‌కారం చూస్తే.. పోల‌వ‌రం ప్రాజెక్టు.. ఏపీ మీద మ‌రింత భారం మోపుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా వారికే నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించి.. వారి వెనుక ప‌డుతూ.. ప‌రిగెత్తించాల్సినప్ప‌టికీ ఆ విష‌యంలో ఫెయిల్ అయిన చంద్ర‌బాబు కార‌ణంగా ఏపీ పోల‌వ‌రం భారాన్ని భారీగా మోయాల్సి ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. ఉమాభార‌తి చెప్పిన మాట విన్న‌ప్పుడు.. త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే అన్న విష‌యంలో మోడీ స‌ర్కారు చాలా క‌చ్ఛితంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News