చలో విజయవాడ సూపర్ హిట్.. కదం తొక్కిన ఉద్యోగులు

Update: 2022-02-03 11:24 GMT
పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతమైనట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. పోలీసుల అడ్డంకులు, నిర్బంధాలను దాటుకొని సుమారు 50వేల మంది ఉద్యోగులు విజయవాడకు వచ్చారని తెలిపారు.

చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలివచ్చి సక్సెస్ చేశారని..ఇప్పటికైనా తమ ఆందోళనను ప్రభుత్వం గుర్తించాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి కోరారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. సీపీఎస్ రద్దు చేయాలని.. పొరుగు సేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పంద ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలన్నారు.

చలో విజయవాడకు లక్షమందికి పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చారని.. నిర్బంధం వల్ల కొందరు రాలేకపోయారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. మా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి నుంచి పెన్ డౌన్ చేపడుతున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఈనెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రకటించారు.

7వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని.. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆగదని వారు ప్రకటించారు.

చలో విజయవాడకు ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. జిల్లాలతోపాటు విజయవాడకు వెళ్లే మార్గాల్లో పోలీసుల నిర్బంధాలు కొనసాగినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్నారు. అంచనాలకు మించి ఉద్యోగులు రావడంతో చేసేదేమీ లేక పోలీసులు చేతులెత్తేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలిరావడంతో విజయవాడ జనసంద్రమైంది. ఎన్జీవో హోం నుంచి అలంకార్ థియేటర్ మీదుగా బీఆర్టీఎస్ కూడలి వరకూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీంతో ఆయా మార్గాలు ఇసుకేస్తే రాలనంతగా మారిపోయాయి.

విజయవాడలో ఉద్యోగుల నిరసన ర్యాలీ అనంతరం బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించే బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అక్కడి ఉద్యోగ సంఘాల నేతలు ట్రాలీ ఆటో ఎక్కి మాట్లాడారు.
Tags:    

Similar News