క‌ద‌నానికి సిద్ధ‌మైన క‌ళా.. టీడీపీలో గుస‌గుస‌

Update: 2020-09-16 13:00 GMT
గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి.. పోనీ.. ఇప్పుడైనా పార్టీ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా ఉందా? అంటే.. అది కూడాలేదు. మ‌రి ఈ స‌మ‌యంలో ఏం చేయాలి? స‌మూల మార్పుల దిశ‌గా అడుగులు వేయాలి.- ఇదే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కొంప‌మీద‌కి తెస్తోంది. ఆయ‌న చేయాల‌నుకుంటున్న మార్పే.. ఇప్పుడు ఆయ‌న‌కు శాపంగా మారుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రెండో సారి విజ‌యం త‌థ్య‌మ‌ని చంద్ర‌బాబు భావించారు. ప‌సుపు-కుంకుమ వంటి ప‌థ‌కాల‌కు తోడు త‌న చ‌రిష్మా కూడా గ‌ట్టిగా ప‌నిచేస్తుంద‌ని అనుకున్నారు.

కానీ, అన్ని వ్యూహాలూ బెడిసి కొట్టి.. చంద్ర‌బాబు చ‌కితుల‌య్యారు. మ‌రి ఈ ఘోర ఓట‌మికి కార‌ణాలు ఏంటి.. అంత‌ర్మ‌థ‌నం చేసుకున్నాక తెలిసివ‌చ్చిన కార‌ణాలు రెండే రెండు.. త‌మ్ముళ్ల‌ను నిలువ‌రించ‌లేక పోవ‌డం, పార్టీని స‌మ‌ర్థంగా ముందుకు న‌డిపించే వ్యూహం లోపించ‌డం. ఈ క్ర‌మంలో ఈ త‌ప్పుల‌ను ఎవ‌రిమీద వేయాల‌నే విష‌యం ఇప్ప‌టికీ.. టీడీపీ తేల్చ‌లేదు. ఎందుకంటే.. ఎవ‌రిమీద వేసినా.. తిరుగుబాటు త‌ప్ప‌దనే! ఈ నేప‌థ్యంలో కొన్నాళ్లుగా ఏపీ పార్టీ అధ్య‌క్షుడిని మార్చాల‌నే డిమాండ్ల తెర‌చాటున వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు, మాజీ మంత్రి లోకేష్‌లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నార‌ని ఆఫ్ దిరికార్డుగా టీడీపీ సీనియ‌ర్లు కూడా చెబుతున్నారు.

అంటే.. మొత్తం బాధ్య‌త‌ను ప్ర‌స్తుత ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావుపై వేసేసి, ఆయ‌న‌ను త‌ప్పించేసి.. మ‌రో నేత‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నార‌నే ప్ర‌చారం టీడీపీలో సాగుతోంది. అయితే, దీనిని శ్రీకాకుళానికి చెందిన క‌ళా వెంక‌ట్రావు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ``అస‌లు నేను ప‌నిచేసుకునే స్వేచ్ఛ ఇచ్చారా? అన్ని విష‌యాల్లోనూ మీరే వేలు పెట్టారు. టికెట్ల పంపిణీ.. నుంచి ప్ర‌చారం వ‌ర‌కు కూడా అన్నీ మీరే చూసుకుని.. ఇప్పుడు న‌న్ను డ‌మ్మీ చేయాల‌ని చూస్తున్నారు`` అని త‌న అనుచ‌రుల వ‌ద్ద వాపోతున్న‌ట్టు తెలుస్తోంది.

మార్పే క‌నుక జ‌రిగితే.. వేరే పార్టీలోకి జంప్ చేయాల‌ని క‌ళా వెంక‌ట్రావు భావిస్తున్న‌ట్టు శ్రీకాకుళం పార్టీ నాయ‌కులు చెప్పుకొంటున్నారు. మ‌రి ఈ ప‌రిణామం.. టీడీపీకి లాభించే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. క‌ళా వెంక‌ట్రావుకు ఉన్న ప‌రిమితులు.. ఆయ‌న‌కు ఎంత స్వేచ్ఛ ఇచ్చార‌నే విష‌యం.. చిన‌బాబు దూకుడు తెలియ‌నిది కాదుగా! అని త‌మ్ముళ్లు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఎలా చూసుకున్నా.. చంద్ర‌బాబు మార్పు నిర్ణ‌యాలు మొద‌టికే ఎస‌రు పెడుతున్నాయ‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News