తెలుగు సినిమాను రారమ్మంటున్న చంద్రబాబు

Update: 2015-10-12 10:16 GMT
రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఈ చర్చ నడుస్తున్నదే.. తెలుగు సినీ పరిశ్రమ కూడా విడిపోతుందా.. టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్‌ కు తరలిపోతుందా అని. కొందరు దీనికి మద్దతుగా మాట్లాడారు. ఇంకొందరు.. ఇక్కడ సకల సౌకర్యాలు ఉండగా అక్కడికెందుకు వెళ్తాం అన్నారు. ఐతే సినీ పరిశ్రమ అనేది చాలా పెద్ద ఆదాయ వనరు. పైగా గ్లామర్ ఉన్న ఇండస్ట్రీ. దీని ద్వారా వచ్చే ప్రచారం అంతా ఇంతా కాదు. అలాంటి పరిశ్రమ తమ రాష్ట్రంలో అడుగుపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకోరు? ఈ విషయంలో ఆయన ప్రణాళికలు ఆయనుకున్నాయి. హఠాత్తుగా కాకున్నా.. నెమ్మదిగా సినీ పరిశ్రమలు వైజాగ్ లాంటి ప్రాంతాలకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా భీమలి-విశాఖపట్నం రోడ్డులోని వజ్ర ఆశ్రమం దగ్గర ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ (ఎఫ్ ఎన్ సీసీ)కి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 15 ఎకరాల్లో ఈ సొసైటీని డెవలప్ చేయబోతుండటం విశేషం. కొండ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రదేశంలో కన్వెన్షన్ హాల్ - హోటళ్లు - ఇతర భవనాలు నిర్మించబోతోంది చంద్రబాబు సర్కారు. ఈ పనులన్నీ పూర్తయ్యాక ఆటోమేటిగ్గా సినిమా వాళ్లు షూటింగ్ కోసం ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు. భీమిలి-విశాఖపట్నం రోడ్డులో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. ప్రకృతి అందాలకు ఈ రోడ్డు పెట్టింది పేరు. ఇప్పటికే విశాఖపట్నంలో దివంగత రామానాయుడు స్టూడియో కూడా కట్టారు. కాకపోతే ఇంకా అక్కడ షూటింగులు ఊపందుకోలేదు. ఒక్కసారి ఆ ఊపు వస్తే వైజాగ్ సినీ పరిశ్రమకు కేంద్రంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. మున్ముందు సినీ పరిశ్రమను వైజాగ్ కు రప్పించడానికి మరిన్ని చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం.
Tags:    

Similar News