జగన్ పై చంద్రబాబు తీవ్రపదజాలం! ఎందుకలా?

Update: 2019-08-22 14:30 GMT
'పిచ్చా? రాష్ట్రానికి శని పట్టిందా? ఎందుకు ఈ మూర్ఖపు నిర్ణయాలు..' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలవరం రివర్స్ టెండరింగ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు ఈ తీవ్రమైన పదజాలం ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో జగన్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

కాంట్రాక్టు సంస్థ లోపాలను ప్రస్తావిస్తూ రివర్స్ టెండరింగ్ కు రంగం సిద్ధం చేసి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేశారు. దీనిపై నవయుగ సంస్థ కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతానికి రివర్స్ టెండరింగ్ పక్రియ కొంత వరకూ ఆగినట్టే. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏ వాదన వినిపిస్తుంది - దానికి కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ముందు ముందు తేలే అంశం. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలోని అంశం.

ఈ అంశం మీద చంద్రబాబునాయుడు స్పందించిన తీరే చర్చనీయాంశంగా మారింది. 'పిచ్చా.. శని పట్టిందా.. మూర్ఖపు నిర్ణయం..' అంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారట. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాఉబ నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవలే చంద్రబాబు నాయుడును ప్రజలు అధికారం నుంచి దించారు.

అది కూడా మామూలుగా కాదు. చిత్తు కింద ఓడించి - భారీ మెజారిటీతో జగన్ కు అధికారాన్ని అప్పగించారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయాలపై జగన్ ప్రభుత్వం సమీక్ష చేయడంలో అంత విడ్డూరం లేదు కూడా. మరి ఈ మాత్రం దానికి చంద్రబాబు నాయుడు ఇలాంటి పదాలు వాడి మరీ ధ్వజమెత్తడం ఆయనలోని ఫ్రస్ట్రేషన్ ను చాటుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
Tags:    

Similar News