'2019' గురించి బాబు లెక్కలు విన్నారా?

Update: 2016-07-08 08:05 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే సిద్ధ‌మ‌వుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల గురించి స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో ముందుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీని బాబు లైట్ తీసుకున్నారు.

రెండేళ్ల ప్రభుత్వ పాలనపై మంత్రులు - ఎమ్మెల్యేలు - పార్టీ సీనియర్లతో కూడిన సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు తన నివాసంలో సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో పుట్టగతులు లేవని, మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ అటాచ్‌ తో కోలుకోలేని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నట్లు తెలుస్తోంది. ఈడీ అటాచ్‌ తో జగన్‌ ఆర్థిక వనరులు దెబ్బతింటాయని అన్నట్లు స‌మాచారం.ఈ పరిణామాలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దని చంద్రబాబు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అలాగే వైకాపా కార్యకర్తలను కూడా నిర్వీర్యం చేయాలని - వీలైతే తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరో పార్టీ తమకు ఎదురు నిలిచే స్థాయిలో ఉండరాదని - ఇందుకోసం ప్రతి ఎమ్మెల్యే - ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చెప్పారు. 2019 ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండాలని, ఏ పార్టీ కూడా మనుగడ సాగించకుండా ప్రజాతీర్పు రావాలని ఆయన సూచించారు. జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ మంత్రులు విస్తృతంగా పర్యటించాలని, కిందిస్థాయి పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తితే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా వారే తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని - ఇందుకోసం మంత్రులు గ్రామాల్లో పర్యటించాలని ఆయన ఆదేశించారు.

శాసనసభ్యులందరి పనితీరుపై సర్వే చేయించానని -సమయం వచ్చినప్పుడు దాన్ని బయటపెడతానని బాబు అన్నారు. పనితీరు మార్చుకోకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొందరు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పక్కవారిని చూసి నేర్చుకునే అలవాటును పెంచుకోవాలని, విజయం సాధిస్తున్న ఎమ్మెల్యేల బాటలో నడవాలని సూచించారు. ప్రభుత్వ ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు అధ్యయనం చేయాలని, వాటిని కార్యకర్తలకు వివరించాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులపై ఇన్‌ చార్జ్‌ మంత్రులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. మంత్రులు సచివాలయానికే పరిమితం కాకుండా జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని, ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యకర్తలను కలుస్తూ వారికి అండగా నిలవాలని ఆయన సూచించారు. కొందరు మంత్రులు జిల్లాల పర్యటనలే మానేశారని, కేవలం తమ నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారని, ఈ పద్ధతులు మానుకోవాలని ఆగ్రహంగా అన్నారు.

ఇదిలా ఉండగా, జిల్లా అధికారులు తాము చెప్పిన ఏ ఒక్క పనిని కూడా చేయడం లేదని, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని కొందరు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తెచ్చారు. మంత్రివర్గ నిర్ణయాలు - ప్రభుత్వ ఆదేశాలను కూడా కొందరు అధికారులు కావాలని పక్కనబెడుతున్నారని, దీంతో ప్రభుత్వం పట్ల ప్రజలకు అసంతృప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. శాసనసభ్యులు చేసే ప్రతిపాదనలను విధిగా అమలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. నిబంధనల మేరకు తాము చేసే సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని, కొందరు అధికారులు కావాలనే చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరారు.
Tags:    

Similar News