ఈ జంపింగ్‌ ల‌కు!...బొమ్మ ప‌డిపోయింది!

Update: 2019-02-28 15:30 GMT
ఓ పార్టీ టికెట్‌ పై బ‌రిలోకి దిగి విజ‌యం సాధించి.. ఆ తర్వాత వారి స్వార్థం కోసం గెలిపించిన పార్టీకి జెల్ల కొట్టేసి వెళుతున్న వారి సంఖ్య ఇటీవ‌లి కాలంలో బాగానే పెరిగిపోయింది. ఈ త‌ర‌హా విప‌రిణామాల‌ను నిరోధించేందుకు పార్ల‌మెంటులో ఏకంగా పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. అయినా కూడా అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా సాగుతున్న కొంద‌రు నేత‌లు త‌మ‌ను చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపిన పార్టీల‌కు మోసం చేస్తూనే ఉన్నారు. ఈ త‌ర‌హా జంపింగ్ జ‌పాంగ్‌ లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరుగానే సాగుతున్నాయి. ఏపీలో విప‌క్ష వైసీపీ త‌ప్పించి... ఇత‌ర పార్టీల నుంచి వ‌స్తున్న ప్ర‌తి నేత‌ల‌ను అన్ని పార్టీలు సాద‌రంగా స్వాగ‌తిస్తున్నాయి. వైసీపీ కూడా ఈ త‌ర‌హా నేత‌ల‌ను స్వాగ‌తిస్తున్నా.. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తేనే చేర్చుకుంటామంటూ నిబంధ‌న పెడుతోంది. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి విజ‌యం సాధించి అధికార టీడీపీలోకి చేరిపోయిన జంపింగ్ నేత‌ల‌కు ఇప్పుడు నిజంగానే బొమ్మ ప‌డిపోతోంది.

ప్ర‌త్యేకించి ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌మాణం చేయ‌క‌ముందే పార్టీ మారిపోయిన క‌ర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి - క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుకల‌కు ఈ ద‌ఫా టీడీపీ అస‌లు టికెట్లే ఇవ్వ‌డం లేదు. మారిన తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీలోకి వ‌చ్చి చేరుతున్న వ‌ల‌స నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు.. చాలా కాలం క్రిత‌మే జంపింగ్ చేసిన వీరిని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భార్య‌ - కుమారుడు - అనుచ‌ర గ‌ణంతో క‌లిసి ఆయ‌న ఎల్లుండి టీడీపీలో చేరిపోతున్నారు. క‌ర్నూలు ఎంపీ టికెట్ తో పాటు ఆలూరు ఎమ్మెల్యే సీటు ఖ‌రారు చేసుకున్న త‌ర్వాతే కోట్ల సైకిలెక్కేస్తున్నారు. దీంతో క‌ర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుక‌కు ఈ ద‌ఫా టికెట్ లేద‌ని చంద్ర‌బాబు తేల్చేశారు.

ఇక నంద్యాలలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉంది. వైసీపీ క‌ర్నూలు జిల్లా క‌న్వీన‌ర్‌ గా ఉన్న గౌరు వెంక‌ట‌రెడ్డి - పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్న త‌న స‌తీమ‌ణి గౌరు చ‌రితారెడ్డితో క‌లిసి త్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌నున్నార‌ట‌. త‌న బావ మాండ్ర శివానంద‌రెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ క‌న్ ఫార్మ్ చేస్తే టీడీపీలోకి వ‌చ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేద‌ని గౌరు చెప్ప‌డంతో... ఆ ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు దాదాపుగా ఓకే చెప్పేశార‌ట‌. అంటే.. నంద్యాల ఎంపీ టికెట్ ఈ ద‌ఫా మాండ్ర‌కే ఖాయ‌మ‌న్న మాట‌. మ‌రి అక్క‌డ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి ప‌రిస్థితి ఏమిటంటే... రిక్త హ‌స్త‌మేన‌ట‌. అంటే... వైసీపీ టికెట్‌ పై విజ‌యం సాధించి ఆ త‌ర్వాత టీడీపీలో చేరిన ఈ ఇద్ద‌రు ఎంపీల‌కు ఇప్పుడు త‌గిన శాస్తి జ‌రిగింద‌న్న మాట‌. ఇక గౌరు చ‌రితారెడ్డి విష‌యానికి వస్తే.. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరు రిజ‌ర్వ్‌ డ్ కేట‌గిరీలోకి వెళ్లిపోతే... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆమెకు నాన్ లోక‌ల్ అయినా పాణ్యం టికెట్ ఇచ్చారు. అక్క‌డ గౌరుకు పెద్ద‌గా బ‌లం లేన‌ప్ప‌టికీ కేవ‌లం జ‌గ‌న్ మేనియాతోనే ఆమె విజ‌యం సాధించారు.

అయితే ఇప్పుడు ఆమె పార్టీ మారి టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా... వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఇంటిలో కూర్చోక త‌ప్ప‌ద‌ట‌. ఎందుకంటే.. అక్క‌డ గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగిన కాట‌సాని రాంభూపాల్ రెడ్డి ఏ పార్టీ అండ లేకున్నా... ఏకంగా 60 వేల‌కు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు కాట‌సాని వైసీపీలో ఉన్నారు. గౌరు పార్టీ మార‌కుండా ఉండి ఉంటే... కాట‌సాని నంద్యాల ఎంపీ బ‌రిలో నిలిచేవార‌న్న వాద‌న ఉంది. అయితే గౌరు పార్టీని వ‌దిలి వెళుతున్న నేప‌థ్యంలో పాణ్యం వైసీపీ టికెట్ ఆయ‌న‌కేన‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇదే జ‌రిగితే... పాణ్యంలో గౌరు ఫ్యామిలీ త‌ల‌కిందుల త‌ప‌స్సు చేసినా... కాట‌సాని గెలుపు ఖాయం. వెర‌సి పార్టీ మారితే...  గౌరుకు కూడా పెద్ద దెబ్బేన‌న్న మాట‌. మొత్తంగా త‌మ‌కు సీటిచ్చి గెలిపించిన పార్టీల‌కు జెల్ల కొడితే... విధి రాతే వీరిని ఇంటికే ప‌రిమితం చేయ‌నుంద‌న్న మాట‌.

Tags:    

Similar News