ఒంటిమిట్ట‌లో ప్ర‌మాదం..ఈ ప్ర‌శ్న‌ల‌కు ఏం చెప్తారు బాబు?

Update: 2018-03-31 17:00 GMT
ఏపీలో గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న‌ ఆధ్యాత్మిక విషాదాల ప‌ర్వంలో మ‌రో ఘ‌ట‌న తోడ‌యింది. గోదావరి పుష్కర దుర్ఘటన, ఆ తర్వాత కృష్ణానదిలో పడవ బోల్తా, ఇప్పుడు ఒంటిమిట్ట అన్న‌ట్లుగా ఆధ్యాత్మిక వాదులు ప్ర‌మాదాల ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావించే స్థాయి దుర్ఘ‌ట‌న జ‌రిగింది. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హాజ‌ర‌వుతున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం నాడు భారీ వర్షానికి చలువ పందిళ్లు కూలిపోయాయి. దీంతో ఐదుగురు మృతి చెందడం -70 మంది గాయపడ‌టం వీరిలో 32 మందికి తీవ్రగాయలవ‌డంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈదురుగాలులకు కల్యాణవేదిక వద్ద ఉన్న రేకులు ఎగిరి పడ‌టం ద్వారా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.!

ఈ ప్ర‌మాదం నేప‌థ్యంలో ఆలయంలో వసతుల ఏర్పాట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యార‌ని ఎప్ప‌ట్లాగే పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల అయింది. ఈ ప్ర‌మాదం జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌డప ఆర్ ఆండ్ బీ గెస్ట్ హౌజ్ లో సీఎం చంద్రబాబు ఉండిపోయారు. అనంత‌రం తిరుపతి రిమ్స్‌లో అర్ధరాత్రి బాధితులను చంద్రబాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 15లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డవారికి 3లక్షల రూపాయలు అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఘ‌ట‌న త‌ర్వాత ప‌రామ‌ర్శ‌లు - ఆర్థిక సహాయం కంటే ప్ర‌భుత్వం ఎందుకు విప‌త్తుల‌ను అరిక‌ట్టే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నేది అనేక మందిలో మెదులుతున్న ప్ర‌శ్న‌.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భారీ ఎత్తున పండుగ‌ల‌ను నిర్వ‌హించాల‌ని అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ చెపుతూ వ‌స్తున్నారు. అంతేకాకుండా తాను కూడా స్వ‌యంగా హాజ‌ర‌వుతున్నారు. అది పుష్కరాలు మొద‌లుకొని తాజా ఘ‌ట‌న వ‌ర‌కు ప్ర‌మాదాలు చోటుచేసుకున్న ఉదంతాలే అధికం. అయితే ఇలాంటి కీల‌క‌మైన అంశానికి సంబంధించి ఎవ‌రూ బాద్య‌త తీసుకోవ‌డం లేదు స‌రికదా దానికి సంబంధించిన త‌దుప‌రి చ‌ర్య‌లు కూడా లేక‌పోవ‌డం వ‌ల్ల తిరిగి అలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ మొత్తం ప‌ర్వంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రువు ప‌లుచ‌న అయ్యే ఉదంతాలే అధికం. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు స‌హ‌జం. ఇంకా చెప్పాలంటే `బాబు పాలనలో గుళ్లకూ - గోపురాలకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తోంది` అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. త‌న‌ది స‌మ‌ర్థ పాల‌న అని, అద్భుత‌మైన విధాన‌ల‌కు తాను పెట్టింది పేర‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు ఎందుకు సీరియ‌స్‌ గా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు అనేది అంద‌రికీ సందేహమే. అయిన‌ప్ప‌టికీ ఎందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు....సాక్షాత్తు ముఖ్య‌మంత్రి హాజ‌ర‌య్యే ప్రోగ్రాంల‌లో ఇదేం వైప‌రిత్యం...ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు? ఎప్పుడు ఈ త‌ర‌హా మ‌ర‌నాలు ఆగుతాయి...ఇవ‌న్నీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లు.


Tags:    

Similar News