బాబు తొందరపాటు వంశీకి వరంగా మారిందా?

Update: 2019-12-13 04:59 GMT
అనుభవం ఉండగానే సరికాదు.. అవసరానికి అక్కరకు రావాలి. అలాంటిది లేనప్పుడు ఎంత ఎక్స్ పీరియన్స్ ఉన్నా ఎలాంటి ఉపయోగం ఉండదు. తాజాగా ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీరు చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు. అనవసరమైన కోపతాపాలకు పోయి తొందరపడిన బాబు తీరు.. ఆయన్ను వ్యతిరేకించిన వంశీకి వరంలా మారిందని చెప్పాలి.

తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఎలాంటి మొహమటానికి పోకుండా ఒకప్పటి తన బాస్ పై నిప్పులు చెరిగారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే వల్లభనేని వంశీకి వరంగా మారిందంటున్నారు. ఒకవేళ పార్టీ మీద కోపంతో వంశీ కానీ పార్టీకి రాజీనామా చేసి ఉంటే.. ఆయన ఎమ్మెల్యేగిరి కూడా రద్దు అయ్యేది. అందుకు భిన్నంగా  పార్టీ చేతే వేటు వేయించుకోవటంతో ఆన ఇండిపెండెంట్ అయ్యారు.

ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే.. ఆ పార్టీలో ఉంటూ వేరే పార్టీకి వెళితే అనర్హత వేటు ఎదుర్కొంటారు. అయితే..తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నుంచి సస్పెండ్ అయితే.. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా మారిపోతారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోపంతో వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు.

ఇప్పుడా నిర్ణయమే గన్నవరం ఎమ్మెల్యేకు కలిసి వచ్చేలా చేసిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ సైతం ప్రస్తావించారు. మొత్తానికి బాబు కోపం.. తొందరపాటు తనను విమర్శించిన వంశీకి వరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News