వెంటాడుతున్న తప్పులు మరోసారి చింతమనేని అరెస్ట్

Update: 2019-10-07 12:22 GMT
చేసిన తప్పులకు మూల్యం చెల్లించాల్సిందే. ఒక రోజు కాకుంటే మరో రోజంటూ మాట్లాడే వారిని కాస్త సిత్రంగా.. మరికాస్త చిరాగ్గా చూసేస్తాం. కానీ.. ఏపీలోని టీడీపీ నేత కమ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో మాత్రం ఇది అచ్చు గుద్దినట్లుగా సరిపోతోంది. బాబు ప్రభుత్వ హయాంలో చింతమనేని వారు ఎంతలా చెలరేగిపోయారో తెలిసిందే.
అయ్యగారి చేష్టల్ని చంద్రబాబు మాష్టారు చేష్టలుడిగి చూస్తుండిపోవటం.. దాంతో చింతమనేని మరింత చెలరేగిపోయేవారు. అలా తప్పుల మీద తప్పులు చేస్తూ.. పశ్చిమగోదావరి జిల్లాలో తనకు తిరుగే లేదన్నట్లుగా వ్యవహరించేవారు. అప్పట్లో ఆయన చేసిన తప్పులకు ఇప్పుడు వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తున్నారు. ఇటీవలే ఆయనపై పలు కేసులకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. ఆ తర్వాత అరెస్ట్ చేయటం తెలిసిందే.

పలు కేసుల్లో రిమాండ్ కు వెళ్లివచ్చిన చింతమనేని వారికి.. తాజాగా మరో కేసులో రిమాండ్ కు వెళ్లాల్సిన దుస్థితి. పెదవేగిలో మోడికొండ మురళీ అనే వ్యక్తిని నిర్బంధించి భౌతికదాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసు 2018లో నమోదైనా చర్యలు మాత్రం తీసుకోలేదు. తాజాగా పాత కేసుల్ని చెక్ చేస్తున్న సమయంలో చింతమనేని వారి లీలలకు సంబంధించిన కేసు బయటకు రావటంతో పోలీసులు ఒక్కసారి అలెర్ట్ అయ్యారు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకొని ఎక్సైజ్ కోర్టు ఎదుట హాజరుపర్చారు.

కేసు వివరాల్ని విన్న న్యాయమూర్తి.. చింతమనేని వారికి పద్నాలురోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో రిమాండ్ కు వెళ్లి వచ్చిన చింతమనేని.. ఐదో కేసులోనూ అలాంటి పరిస్థితే రిపీట్ అయిన పరిస్థితి. రానున్న రోజుల్లో మరెన్ని కేసులు బయటకు రానున్నాయో?
Tags:    

Similar News