2024 ఎన్నికలలో ఒక ప్రేక్షకుడిని అంటున్న చిరంజీవి...!

Update: 2023-01-13 02:30 GMT
మెగాస్టార్ చిరంజీవి. మెగాభిమానులు పుష్కలంగా ఉన్న వారు. అశేష తెలుగు జనాల విశేష అభిమానం సంపాదించుకున్న వారు. ఆయన ఎటు వైపు మొగ్గితే అటు వైపు రాజకీయం సానుకూలం అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి ఆషామాషీ వారు కాదు. నాలుగున్నర దశాబ్దాల సినీ జీవితం పండించుకున్న వారు. అంతే కాదు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో అటూ ఇటూ కుంభస్థలాల లాంటి వైఎస్సార్ చంద్రబాబులను ఢీ కొట్టి కూడా డెబ్బై లక్షల ఓట్లు పద్దెనిమి సీట్లు సాధించుకున్నారు.

చిరంజీవి పొలిటికల్ స్టామినాను ఎవరూ తక్కువ అంచనా వేయలేదు కానీ ఆయన రాంగ్ టైమింగ్ లో పార్టీ పెట్టారు అన్నదే అంతా అనుకున్నారు. ఇక సీన్ కట్ చేస్తే ఆయన 2018లో రాజ్యసభ సీటు పదవీకాలం అయిపోయిన తరువాత పూర్తిగా రాజకీయాలకు స్వస్తివాచకం పలికేశారు. తన సినిమాలూ తానూ అన్నట్లుగా ఉన్నారు.

అయితే అదే ఇంటి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన అంటూ సొంత రాజకీయ పార్టీ పెట్టి జనాలకు చేరువ అవుతున్నారు. ఆయన ఢీ అంటే ఢీ అని వైసీపీని జగన్ని గట్టిగా ఢీ కొడుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్ రాజకీయంగా రాణించాలి అని చాలా సార్లు చిరంజీవి అన్న మాటలు కూడా ఉన్నాయి. పవన్ గట్టి సంకల్ప బలం ఉన్న వారు ఆయన అనుకున్నది సాధిస్తారు ఏదో నాటికి ఆయన ఉన్నత స్థానాలు అందుకుంటారు అని కూడా చిరంజీవి చెప్పి ఉన్నారు.

అయితే తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కి ముందు జరిగిన మీడియా ఇంటర్వ్యూలలో మాత్రం చిరంజీవి రాజకీయాల మీద అనాసక్తిగా మాట్లాడారు. తనకు రాజకీయాలు అంటే ఆసక్తి లేనేలేదని చెప్పేశారు. ఇక ఒక వెబ్ మీడియా చేసిన ఇంటర్వ్యూలో అయితే ఆయన తాను ఎటువంటి పొలిటికల్ స్టాండ్ ని 2024 ఎన్నికల్లో తీసుకోనని కుండబద్ధలు కొట్టడం విశెషం. అంతే కాదు, మెగాభిమానులకు కూడా ఏ రకమైన సందేశాలూ ఇవ్వబోమని చెప్పేశారు.

తాను ఏ వైపూ ఉండను అంటూ ఆయన చాలా క్లారిటీగా చెప్పేశారు. ఈ సందర్భంగా ఆ వెబ్ మీడియా కొన్ని ప్రశ్నలను గుచ్చి గుచ్చి అడిగినా ఇదే నా స్టాండ్ అని చిరంజీవి చెప్పడం విశేషం. తాను ఎవరికీ సాయం చేయబోనని, తాను కూడా 2024 ఎన్నికలను ఒక ప్రేక్షకుడిగా చూస్తాను తప్ప తన ప్రమేయం కానీ తన పాత్ర కానీ ఎక్కడా ఉండదు, ఇది నూరు శాతం నిజం నమ్మి తీరాలని చెప్పుకొచ్చారు.

తన ఇంట్లో నుంచి ఎదిగి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇపుడు తనకంటూ సొంతంగా ఒక రూట్ వేసుకుని వెళ్తున్నారని, ఆయన దారిలో ప్రయాణిస్తూంటే ఒక ప్రేక్షకుడిగా చూడడం తప్ప తాను మరేమీ చేయబోనని అన్నారు. అన్నయ్యా నాకు నీవు సాయం చేయి అని అడిగినా నీకు  నా సాయం అక్కరలేదురా అని సున్నితంగా చెప్పేస్తాను అని మెగాస్టార్ సంచలన కామెంట్స్ చేశారు.

అంతే కాదు తాను ఏదీ ఎవరి నుంచి ఆశించను, ఏదీ ఫలనాగా జరగాలని కోరుకోనని చెప్పారు. తాను ప్రస్తుతం ఒక అతీతమైన స్థితిలో ఉన్నానని, తాను సినిమాలు తప్ప మరో ప్రపంచం లేదని ఆయన అన్నారు. మొత్తానికి 2024లో చిరంజీవి తన రాజకీయ స్టాండ్ ఇదే అంటున్నారు. నిజానికి చిరంజీవి జనసేనకు బ్యాక్ బోన్ గా ఉంటారని, ఎన్నికల వేళకు జనంలోకి వచ్చి ప్రచారం చేస్తారని అంతా ఆశించారు. కానీ ఆయన మాత్రం రాజకీయాలకు తాను బహు దూరం అంటున్నారు.

అంతే కాదు తన మీద రాజకీయ నీడ కూడా పడకూడదు అని చాలా జాగ్రత్త పడుతున్నారు. మరి మెగాస్టార్ లో ఈ రకమైన మార్పు రావడం అంటే ఆశ్చర్యమే. ఆయన ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నారో తెలియదు కానీ వాల్తేర్ వీరయ్య సినిమా గురించి మాట్లాడుతూ తన రాజకీయ జీవితం గురించి ఎవరూ ఇకపైన ఎటువంటి ప్రశ్నలు వేయకుండా కచ్చితమైన శాశ్వతమైన జావాబులే చెప్పేశారు అని అంటున్నారు. సో మెగాస్టార్ ఒక మామూలు ఓటరు గానే ఉంటాను అని అంటున్నారు అంటే ఆయన రాజకీయాల గురించి విసిగి ఈ మాటలు అంటున్నారా లేక రాజకీయాలే ఆయన్ని ఇలా వద్దు అనిపించేలా చేశాయా అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావడంలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News