చోక్సీ విచార‌ణ జీవిత‌కాల‌పు వాయిదా!

Update: 2021-06-06 08:30 GMT
నిందితుడు ప‌క్కాగా ఉంటున్నాడు.. దాన్ని నిరూపిస్తున్నాడు కూడా! విజ‌య్ మాల్యా.. నీర‌వ్ మోడీ.. చోక్సీ.. రేపు ఇంకా ఎంత మంది పుట్టుకొస్తారో తెలియ‌దు. దేశ‌సంప‌ద‌ను మింగేసి, ద‌ర్జాగా విదేశాల‌కు పారిపోతున్నారు. అక్క‌డ హ్యాపీగా జీవితం గ‌డిపేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ అర్థంకాని విష‌యం ఒక‌టుంది. ఒక త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు.. పున‌రావృతం కాకుండా చూసుకోవ‌డం మ‌నుషుల క్ష‌ణం. మ‌రి, బ్యాంకుల విష‌యంలో ఇది ప‌దే ప‌దే ఎందుకు జ‌రుగుతోంద‌న్న‌ది ప్ర‌శ్న‌.

వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయే వ‌ర‌కూ బ్యాంకులు ఏం చేస్తున్నాయ‌నే అనుమానాల‌కు స‌మాధానం లేదు. బ్యాంకులకు అంతా తెలిసే.. తెలియ‌నట్టు ఉంటున్నాయా? అనే సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు జ‌నం. సాధార‌ణ రైతు అప్పు తీర్చ‌క‌పోతే.. జ‌ప్తు అని వెంట‌ప‌డే బ్యాంక‌ర్లు, వేలు.. ల‌క్ష‌ల కోట్లు మోస‌గించి, ప‌రాయి దేశాల‌కు వెళ్లిపోయే వ‌ర‌కూ ఎందుకు మౌనంగా ఉంటున్నాయ‌న్న‌ది అంతుచిక్క‌ని వ్య‌వ‌హారం.

దేశం విడిచిపోయిన త‌ర్వాత తిరిగి తీసుకొచ్చే కార్య‌క్ర‌మం ఓ ప్ర‌య‌త్న‌మే త‌ప్ప‌.. చాలా వ‌ర‌కు అవ‌కాశం ఉండ‌ద‌నేది నిపుణులు చెబుతున్న మాట‌. వెన‌క్కి వ‌చ్చే అవ‌కాశం లేకుండా నిందితులు ముందుగానే ఆయా దేశాల్లో ఏర్పాట్లు చేసుకుని ఉంటార‌ట‌. ఇప్పుడు మాల్యా, మోడీ, చోక్సీ ఇదేవిధ‌మైన ఎత్తుగ‌డ‌ల‌తో దేశం వ‌దిలిపారిపోయార‌ని అంటున్నారు.

వీళ్లు వేసే ఎత్తుగ‌డ‌ల్లో రెండు ప్ర‌ధానంగా ఉంటాయి. ఒక‌టి ముందుగానే అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధుల‌కో, అధికారుల‌కో భారీగా డ‌బ్బులు ముట్టజెపుతారు. ఆ త‌ర్వాత తాము ఎంచుకున్న దేశాల్లో ఏదో చిన్న‌పాటి త‌ప్పు చేస్తారు. ఆ త‌ప్పుకు సంబంధించిన విచార‌ణ‌ అక్క‌డి కోర్టులో కొన‌సాగుతూ ఉంటుంది. ఆ విచార‌ణ పూర్త‌యితే త‌ప్ప‌, స్వ‌దేశానికి పంపించ‌ర‌న్న‌మాట‌. లండ‌న్ మాల్యా.. డొమెనికాలో ఛోక్సీ ఇదే త‌ర‌హా వ్యూహం అమ‌లు చేశార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

భార‌త్ నుంచి మూడేళ్ల క్రితం ఆంటిగ్వా పారిపోయిన ఛోక్సీని భార‌త్ ర‌ప్పించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంది. ఇది సాధ్య‌మ‌వుతుందేమోన‌ని భావించిన ఛోక్సీ డొమినికా పారిపోయాడు. త‌మ దేశంలో అక్ర‌మంగా ప్ర‌వేశించాడ‌ని అక్క‌డి కోర్టులో కేసు దాఖ‌లైంది. ఇప్పుడు విచార‌ణ సాగుతోంది. జూన్ 2న విష‌యం తేలిపోతుంది. భార‌త్ కు వ‌స్తాడ‌ని అనుకున్నా అది జ‌ర‌గ‌లేదు. అటు ఆంటిగ్వా కూడా భార‌త్ పంపించాల‌ని కోరినా సాధ్యం కాలేదు. ఈ కేసును జులైకి వాయిదా వేసింది అక్క‌డి కోర్టు. ఆ త‌ర్వాత ఎన్ని వాయిదాలు ప‌డ‌తాయో..? ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ విధంగా డ‌బ్బుల‌తో అక్క‌డి వాళ్ల‌ను ముందుగానే మేనేజ్ చేస్తున్న నేర‌గాళ్లు.. అక్క‌డికి వెళ్లి హాయిగా జీవిస్తున్నారు. మ‌రి, భార‌త ప్ర‌భుత్వం ఇలాంటి వాళ్ల‌ను అడ్డుకునేందుకు ఇక‌నైనా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుందో..?!
Tags:    

Similar News