వావలంటీర్ పోస్టులు: మూడు ముడుపులు.. ఆరు ఫైరవీలు?

Update: 2019-08-05 03:37 GMT
నిన్న చిలకలూరిపేట పురపాలక సంఘం కార్యాలయం.. వాలంటీర్ల పోస్టుకు ఎంపిక చేసిన జాబితాలో  అర్హులకు అన్యాయం జరిగిందని అంటించిన జాబితాను లబ్ధిదారులు చింపేశారని వార్తలొచ్చాయి.. ఇది రచ్చ రచ్చ అయ్యింది. ఇక నిన్న కమలాపురంలో ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి వాలంటీర్ల పోస్టుల్లో జోక్యం చేసుకున్నారని ఇంటి ముందు ధర్నా చేసినట్టు సమాచారం.. ఇక ఈరోజు మాజీ ఎమ్మెల్యే వీరాశివారెడ్డి వర్గానికి వాలంటీర్ల పోస్టులు ఇవ్వాలని ఆయన లేఖ రాయడంతో వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటి ఎదుట ధర్నా చేశారట..

ఇలా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్ల వ్యవస్థ మూడు ముడుపులు, ఆరు ఫైరవీల చందంగా మారిందన్న విమర్శలు క్షేత్ర స్థాయి నుంచి వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ గద్దెనెక్కగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరుద్యోగ యువతకు వాలంటీర్ల పోస్టులు ఇచ్చి ఉపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, అవినీతికి దూరంగా లబ్ధిదారులకు అందించేందుకు ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.

అయితే వాలంటీర్ల పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించి ఇప్పుడు ఎంపిక చేసే టైంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకుల ప్రమేయంతో ఈ పోస్టులు పక్కదారి పడుతున్నాయట.. దీంతో మొత్తం ఎంపిక ప్రక్రియ భష్టుపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యాక కూడా అర్హులను పక్కనపెట్టి అనర్హులకు రికమండేషన్ తో పోస్టులు కట్టబెడుతున్నారని అర్హులైన వారు ఆందోళనలకు దిగుతుండడం దుమారం రేపుతోంది.

ప్రధానంగా వైసీపీలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు ఈ వాలంటీర్ల పోస్టులపై కన్నేశారన్న విమర్శలొస్తున్నాయి.. పార్టీ కోసం కష్టపడ్డ తమకే ఈ పోస్టులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు- వైసీపీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారట.. దీంతో వైసీపీ నేతలు కూడా బెండ్ అయిపోయి వారికే కట్టబెడుతున్నారని సమాచారం. దీంతో అసలైన అర్హులు రోడ్డెక్కుతున్నారు.

ఈ పరిణామం అంతిమంగా టీడీపీ జన్మభూమి కమిటీలను తలపించేలా క్షేత్రస్థాయిలో రూపుదిద్దుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ అండ్ కో మేలుకోకపోతే మరి పెద్ద అవినీతి వటవృక్షంగా వాలంటీర్ల వ్యవస్థ తయారయ్యే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు, అర్హులైన వారు హెచ్చరిస్తున్నారు.

    
    
    

Tags:    

Similar News