తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి శుభవార్త చెప్పిన సీఎం జగన్

Update: 2020-08-21 12:31 GMT
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కష్ట కాలంలో కూడా పలు కీలకమైన నిర్ణయాలతో అందరి ప్రసంశలు పొందుతున్నారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనాను అరికడుతూనే .. మరోవైపు సంక్షేమ పథకాల అమల్లో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కార్యక్రమాల్లో తాత్కాలికంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. కరోనా ఆసుపత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచినట్లు తెలిపారు.స్పెషలిస్ట్ ‌లు, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులకి ఆదేశాలు ఇచ్చారు.

287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్త స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. కరోనా స్పెషల్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు,వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, నిరంతరంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలని సూచించారు. కరోనా‌ కాల్‌ సెంటర్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం జగన్.. ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. అలాగే కరోనా రోగులకు సేవలు అందిస్తున్న కరోనా స్పెషల్ ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

కరోనా ప్రత్యేక ఆసుపత్రులు అందిస్తున్న సేవలకు అనుగుణంగా రేటింగ్ ఇవ్వాలని అన్నారు. ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలని.. రిఫరల్‌ ప్రోటోకాల్‌ చాలా స్పష్టంగా ఉండాలని వెల్లడించారు. పేషెంట్‌ను ట్రీట్‌చేయకుండా అవసరం లేకుండా రిఫర్‌ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చెప్పాలని సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్య ఆసరా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. డెలివరీ అవగానే తల్లికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలును పరిశీలించాలని తెలిపారు.




Tags:    

Similar News