విద్యుత్ సంక్షోభంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ

Update: 2021-10-09 06:32 GMT
ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విద్యుత్ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ విద్యుత్ సంక్షోభం ముగింట ఉందని.. ఏపీ కోసం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యల గురించి సీఎం జగన్ వివరించారు.

కోవిడ్ అనంతరం విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిందని లేఖలో జగన్ వివరించారు. గత ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15శాతం పెరిగిందని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ వివరించారు. సెప్టెంబర్ నెలలోనే విద్యుత్ డిమాండ్ 20శాతానికి పెరిగిందని జగన్ పేర్కొన్నారు. కొన్నిసార్లు విద్యుత్ కొనుగోలు చేయాలంటే యూనిట్ కు 20 రూపాయలు చెల్లించాల్సి వస్తోందని తీవ్ర ఆర్థిక భారం పడుతోందని జగన్ లేఖలో వివరించారు. కోవిడ్ తర్వాత ఏపీలో విద్యుత్ వినియోగం 20శాతం మేర పెరిగిందని వివరించారు.

బొగ్గు కొరత వల్ల విద్యుత్ ప్లాంట్లు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ జెన్ కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 45శాతం మేరకు తీర్చగలుగుతోందని జగన్ వివరించారు. 1-2 రోజులు బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నట్లు లేఖలో తెలిపారు. బొగ్గు కొరత వల్ల ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని మోడీకి జగన్ వివరించారు.

రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం 50శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని జగన్ వెల్లడించారు. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రోజుకు 75 శాతం మేర మాత్రమే ఉత్పత్తి అవుతోందని తెలిపారు.

ఏపీ అవసరాల కోసం విద్యుత్ కొనుగోలు చేయాలని భావించినా అందుబాటులో ఉండడం లేదని సీఎం జగన్ తెలిపారు. ఏపీ థర్మల్ ప్రాజెక్టులకు 20 ర్యాక్ ల బొగ్గు కేటాయించాలని ప్రధానిని జగన్ కోరారు. పనిచేయని బొగ్గు ప్లాంట్లను వెంటనే పునరుద్ధరించాలని.. ఓఎన్.జీసీ, రిలయన్స్ ద్వారా ఏపీకి గ్యాస్ సరఫరా చేయాలని విన్నవించారు. ఇక విద్యుత్ డిస్కంలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరారు. మరో 500 మెగా వాట్లు ఇవ్వాలని లేఖలో జగన్ విన్నవించారు.




Tags:    

Similar News