భూసర్వేతో ఎవరూ చేయని సాహసం చేస్తున్నాం :కేసీఆర్

Update: 2020-09-14 17:32 GMT
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సమగ్ర భూ సర్వేతోనే భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టామని, ఆ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలుపడంతో రైతులంతా సంబరాలు చేసుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. తాజాగా శాసన మండలిలో ఆ బిల్లులను ప్రవేశపెట్టిన కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా భూసర్వే పూర్తి చేస్తామని, భూవివాదాలన్నింటికీ ధరణి పోర్టలే పరిష్కారమని చెప్పారు. భూసర్వేతోనే 99శాతం సమస్యలు పరిష్కారమవుతాయని, దశాబ్దాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులకు ఏడాదిలోపు చెక్ పెట్టబోతున్నామని అన్నారు. అవినీతికి తావులేని విధంగా ఇకపై భూమి రిజిస్ట్రేషన్లు, సర్వేలు జరుగుతాయని,10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.

గతంలో ఎవ్వరూ చేయని విధంగా సాహసం చేస్తున్నామని, ధరణి పోర్టల్, సమగ్ర భూసర్వేతో భూముల రికార్డులలో పారదర్శకత తీసుకువస్తున్నామని చెప్పారు. ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం ఎమ్మార్వోలకు కూడా లేదని, బయోమెట్రిక్‌, ఐరిస్‌, ఆధార్‌, ఫోటోలతో పకడ్బందీగా ధరణిలో వివరాలు అప్డేట్ అవుతాయని చెప్పారు. భూ యజమాని అనుమతి లేనిదే మార్పులు చేయలేమని, అరగంటలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్డేషన్ పూర్తవుతుందని చెప్పారు. భూ సర్వేకు కొంత సమయం పడుతుందని, అయినా, రైతుల సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయని అన్నారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూముల కొలతల వివరాలను నమోదు చేస్తామని..ఇకపై భూ తగాదాలు, పంచాయతీలు లేకుండా చేస్తామని అన్నారు. ఎవరన్నా కావాలని భూ వివాదాలు సృష్టిస్తే...వారు సివిల్ కోర్టులకు వెళ్లవచ్చని, ప్రభుత్వం వారి కోసం టైం వేస్ట్ చేయదని అన్నారు.
Tags:    

Similar News