22న జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌.. హీటెక్కిన కుప్పం!

Update: 2022-09-18 07:46 GMT
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సెప్టెంబ‌ర్ 22న కుప్పంలో ప‌ర్యటించ‌నున్న సంగ‌తి తెలిసిందే. గత ఏడు ప‌ర్యాయాలుగా కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు మొత్తం ఏడుసార్లు చంద్ర‌బాబు కుప్పం నుంచి ఘ‌న‌విజ‌యం సాధించారు. త‌ద్వారా కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని టీడీపీ కంచుకోట‌గా మార్చారు.

అయితే ఏపీలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాల‌నే యోచ‌న‌లో సీఎం జ‌గ‌న్ ఉన్నారు. ఇందుకు మొద‌ట‌గా కుప్పంను ల‌క్ష్యంగా ఎంచుకున్నారు. ఇప్ప‌టికే కుప్పంకు చెందిన 50 మంది క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల‌తో సీఎం జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. అంతేకాకుండా కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన భ‌ర‌త్‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అంతేకాకుండా ఆయ‌న‌ను చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా నియ‌మించారు.

మ‌రోవైపు కుప్పంను ఇటీవ‌ల రెవెన్యూ డివిజ‌న్ ప్ర‌క‌టించారు. రూ.66 కోట్లు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి విడుద‌ల చేశారు. పులివెందుల ఎలాగో కుప్పం కూడా త‌న‌కు అలాగేన‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు కుప్పంలో ప‌ర్య‌టించ‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్ని విధాల అడ్డంకులు సృష్టించిన విష‌యం తెలిసిందే. కుప్పంలో అన్నా క్యాంటీన్‌ను వైఎస్సార్సీపీ నేత‌లు ధ్వంసం చేశారు. రెండు పార్టీలు ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకున్నాయి. టీడీపీకి చెందిన ప‌లువురిని పోలీసులు అరెస్టు కూడా చేశారు.

ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ సెప్టెంబ‌ర్ 22న కుప్పంలో ప‌ర్య‌టిస్తుండ‌టం హీట్‌ను పెంచుతోంది. ఇప్ప‌టికే కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన పంచాయతీ, మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల‌ను వైఎస్సార్సీపీ కొల్ల‌గొట్టింది. అంతేకాకుండా కుప్పం మున్సిపాలిటీలోనూ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్ర‌బాబును ఓడించాల‌నే ప‌ట్టుద‌లతో ఉంది.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ కుప్పంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు నియోజ‌క‌వ‌ర్గంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టన‌ను పుర‌స్క‌రించుకుని గోడ‌ల‌పైన 175/175కి సీట్లు అని రాసి హంగామా సృష్టిస్తున్నారు. అంతేకాకుండా త‌మ ఫ‌స్ట్ టార్గెట్ అని కుప్పం అని, హార్ట్ లీ వెల్‌క‌మ్ సీఎం జ‌గ‌న్ అని స్లోగ‌న్స్ గోడ‌లు మీది రాసి హీట్ పెంచుతున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News