పాతికేళ్ల తర్వాత అంత సాహసం చేసిన సీఎం జగనేనట

Update: 2020-05-08 06:13 GMT
కనిపించరు కానీ అత్యున్నత స్థానాల్లో ఉన్న వారెంతో అప్రమత్తంగా ఉంటారు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్న చందంగా చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు. వినేందుకు విచిత్రంగా ఉన్నా.. అర్థం లేని ఎన్నో సెంటిమెంట్లను గుడ్డిగా పాటిస్తుంటారు. అలాంటి వాటిని తాను పట్టించుకోన్నట్లుగా వ్యవహరించి.. తనకున్న ధైర్యసాహసాల్ని ప్రదర్శించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారెవరూ వైజాగ్ లోని కేజీహెచ్ ఆసుపత్రిని సందర్శించరు. దీనికి కారణం లేకపోలేదు.. అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్.. తన వైజాగ్ పర్యటనలో కేజీహెచ్ ను సందర్శించటం.. తర్వాత ఆయన పదవి పోవటంతో.. అదో సెంటిమెంట్ గా మారింది.

ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారు. ఇలా ఎందరో చేయలేని సాహసాన్ని తాజాగా జగన్ చేశారు. కేజీహెచ్ కు వెళితే పదవి పోతుందన్న భయానికి భిన్నంగా.. విశాఖలో తాజాగా నెలకొన్న కెమికల్ లీక్ ఉదంతంలోని బాధితుల్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి స్వయంగా వెళ్లారు. దీంతో.. ఎన్టీఆర్ తర్వాత కేజీహెచ్ కు వెళ్లిన తొలి ముఖ్యమంత్రి జగన్ మాత్రమే కావటం గమనార్హం. సెంటిమెంట్ భయానికి పాతర వేస్తూ.. ప్రజాసంక్షేమంలో తనకు ప్రజలు మాత్రమే ముఖ్యం కానీ.. అర్థం లేని సెంటిమెంట్లు కాదన్న విషయాన్ని తన తీరుతో స్పష్టం చేశారని చెప్పాలి.
Tags:    

Similar News