కరోనా తీసుకొచ్చిన మాయదారి అలవాటు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Update: 2021-03-24 06:30 GMT
కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు విధించిన లాక్ డౌన్ పుణ్యమా అని దరిద్రపుగొట్టు అలవాటు ఒకటి మనుషుల్ని బాగా పట్టేసిందన్న చేదు నిజాన్ని వెల్లడించిందో అధ్యయనం. లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ పరిశోధక టీం ఈ విషయాన్ని చెప్పింది. కరోనాకు ముందు శారీరక కదలికలు ఎక్కువగా ఉంటే.. లాక్ డౌన్ తో అవన్నీ బాగా తగ్గిపోయాయని వెల్లడించింది. రోజువారీ కార్యకలాపాలతో పాటు.. దినచర్యల్లోనూ మార్పు వచ్చిన వైనాన్ని పేర్కొంది.

పరిశోధనలో భాగంగా భిన్నమైన శారీరక సామర్థ్యాలు ఉన్న వారి దినచర్యల్ని పరిగణలోకి తీసుకున్నారు. సొంతంగా పని చేసుకునే వారి లైఫ్ మొదలు ఒకరిపై ఆధారపడి వీల్ చెయిర్ పై ఆధారపడే వారి వరకు పలువురి దినచర్యల్ని ఇందులో భాగంగా పరీక్షించారు. లాక్ డౌన్ కు ముందు నిత్యం 84.5 నిమిషాల పాటు తేలికైన పనుల్లో నిమగ్నమైతే.. లాక్ డౌన్ వేళ ఇది సగటున 25 నిమిషాలకు పడిపోయినట్లుగా గుర్తించారు. గంటల కదలికల ప్రకారం చూస్తే.. ఇది 11 శాతం తగ్గిందని తేల్చారు.

లాక్ డౌన్ తో ఉద్యోగాలన్ని ఇంట్లోనే చేయాల్సి రావటం.. వర్క్ ఫ్రం హోం అంతకంతకూ పెరిగిపోవటం.. స్నేహితులు.. తెలిసిన వారిని కలవలేకపోవటం.. విశ్రాంతి కోసం బయటకు వెళ్లకపోవటం లాంటి పనులు కూడా శారీరక కదలికలపై ప్రభావాన్ని చూపినట్లుగా తేల్చారు. రోజువారీ వ్యాయామంతో పాటు దినచర్యలు కూడా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అవకాశం ఉంది.

లాక్ డౌన్ కారణంగా దినచర్యల్లో మార్పులు రావటం.. వ్యాయామంపై అంతగా శ్రద్ధ చూపకపోవటం ఎక్కువైనట్లుగా గుర్తించారు. అందుకే గంటల ప్రతి ఐదు నిమిషాలు శరీరాన్ని కదల్చాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు.. రోజుకు కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. లాక్ డౌన్ తో మారిన దినచర్య.. నేటికి పెద్దగా మారకపోవటం.. ఇంట్లో నుంచి పని చేసే వారిలో అలానే కంటిన్యూ కావటం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News