భారత్ కు మూడో వేవ్ తప్పదా.. జాగ్రత్తలేంటి?

Update: 2021-05-01 03:41 GMT
కరోనా మహమ్మారి గతేడాది నుంచి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజూ మూడు లక్షలకు పైగా రోజూవారి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ లో రెండో దశ వ్యాప్తి అధికంగా ఉంది. ఇక్కడి వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. భారత్ సెకండ్ వేవ్ తో ఇతర దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇక్కడి పరిస్థితులు చూసి అప్రమత్తమవుతున్నాయి. అయితే సెకండ్ వేవ్ మరికొంత కాలం కొనసాగనుందని నిపుణులు అంటున్నారు.

రాబోయే మూడు, నాలుగు మాసాల్లో మూడో వేవ్ సంక్రమిస్తుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. థర్డ్ వేవ్ లో పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చుతాయని చెబుతున్నారు. రెండో దశలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.. ఇక మూడో దశలో అది పెను ప్రమాదంగా మారుతుందని చెబుతున్నారు. దేశంలో 139 కోట్లకు పైగా జనాభా ఉంది. వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. రాబోయే దేశం అభివృద్ధి కోసం ఇప్పుడు వీరిని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. టీకాలు తీసుకోవడం వల్ల మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు దేశంలో 15 కోట్ల మందికి మాత్రమే టీకా ఇచ్చారు. అంటే దేశ జనాభాలో కేవలం 9 శాతం మాత్రమే. సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. అందరికీ టీకా అందుబాటులోకి రావాంటే మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ప్రభుత్వాలు తగు నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

మూడో దశ రాకుండా ఉండాలంటే విదేశీయుల రాకపోకలను నిలిపివేయాలని అంటున్నారు. ఎగుమతులు, దిగుమతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లాక్ డౌన్ కాకుండా సమాంతర చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెబుతున్నారు. ఇవన్నీ చేపడితే ఏమో కానీ... ఇంకా ఆలస్యం చేస్తే మూడో వేవ్ ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా పట్ల ప్రజలు మరికొన్నాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Tags:    

Similar News