ప‌వ‌న్ కూడా వ‌దిలేశాడు..ఆవేద‌న‌లో ఎర్ర‌న్న‌లు

Update: 2018-05-02 16:06 GMT

2019 సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో పోటీ అంశంపై ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ విష‌యాల‌ను వెల్ల‌డించిన జ‌న‌సేన అధినేత‌...తాము  ఒంట‌రిగా బ‌రిలో దిగ‌నున్నామ‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఆయా పార్టీల్లో ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌ధానంగా వామ‌ప‌క్షాల శిబిరంలో క‌ల‌క‌లం నెల‌కొంటోంది. త‌మ‌ను క‌రివేపాకులాగా ప‌క్క‌న‌పెట్టేశార‌ని వామ‌ప‌క్షాల్లో చ‌ర్చ జ‌రుగుతోంద‌ని అంటున్నారు.

కొద్దికాలం క్రితం వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వామ‌ప‌క్షాల‌తో ఓ రేంజ్‌లో స‌ఖ్య‌త‌ను క‌న‌బ‌ర్చిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీ మొద‌లుకొని గ‌త నెల‌లో విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో నిర్వ‌హించిన స‌ద‌స్సుల వ‌ర‌కు వామ‌పక్షాల భాగ‌స్వామ్యం లేకుండా ఏదీ జ‌ర‌గ‌లేదు. ఇక ప‌వ‌న్ నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో ఆయ‌న‌ త‌ర్వాత సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ ఎవ‌రంటే...వామ‌ప‌క్షాల నేత‌లే. అలాంటి వామ‌ప‌క్షాల‌తో ప‌వ‌న్ పొత్తు పెట్టుకోకుండా ఎలా ఉంటార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెడుతూ ప‌వ‌న్ త‌నే సొంతంగా బ‌రిలో దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పొత్తులు లేవ‌ని తేల్చిచెప్తూ...175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన రంగంలోకి దిగుతుంద‌ని క్లారిటీ ఇచ్చారు. త‌ద్వారా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు తీపిక‌బురు ఇస్తే..వామ‌ప‌క్షాల‌కు షాక్ ఇచ్చారు.

ఇన్నాళ్లు త‌మతో క‌లిసి న‌డిచి, త‌మ‌కు అగ్ర‌తాంబూలం వేసిన ప‌వ‌న్ ఇప్పుడు ఇలాంటి షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారేంట‌నే చ‌ర్చ వామ‌ప‌క్షాల్లో జ‌ర‌గుతోంద‌ని అంటున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో క‌లిసి సాగి అసెంబ్లీలో అడుగుపెట్టాని భావించిన ఆ పార్టీ నేత‌ల‌కు తాజా ఎపిసోడ్ షాక్ వంటిద‌ని చెప్తున్నారు. త‌మ‌ను వాడుకునేందుకు, క్షేత్ర‌స్థాయిలో త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను ఉప‌యోగించుకునేందుకు మాత్ర‌మే జ‌న‌సేనాని దోస్తీక‌ట్టాడా? అంటూ వాపోతున్నారు.
Tags:    

Similar News